ట్రిపుల్ తలాక్ అంటే? - MicTv.in - Telugu News
mictv telugu

ట్రిపుల్ తలాక్ అంటే?

August 22, 2017

ముస్లిల జీవనవిధానంపై  ఖురాన్, హదీస్ లతో పాటు కొన్ని ధార్మిక సంబంధ వివరణల్లో స్పష్టమైన సమాచారం ఉంది. అయితే ఆ విషయాలను అర్థం చేసుకోవడంతోపాటు ఆచరించడంలో వచ్చిన సమస్యలతోనే ఇవాళ ట్రిపుల్ తలాక్ పై సుప్రీం కోర్టు స్పందించాల్సి వచ్చింది.

ముస్లింలలో పెళ్లి అంటే ఒక ఒప్పందం. అదో రిజిస్టర్ మ్యారేజ్. ఈ ఒప్పందాన్ని నికాహ్ నామా అంటారు. అది ఒకటి వరుడి దగ్గర, ఇంకొకటి వధువు దగ్గర, మరొకటి నిఖా జరిపించిన ఖాజీ దగ్గర ఉంటుంది. ముస్లింలు ఆచరించే చాలా విషయాల గురించి దివ్యఖురాన్ లో ఎలాంటి సమాచారమూ లేదు. కాని పెళ్లి, తలాక్ కు సంబంధించి మాత్రం స్పష్టమైన వివరణ ఉంది. స్త్రీ హక్కులు, రక్షణను దృష్టిలో ఉంచుకుని తలాక్ విధివిధానాలు రూపొందించారు.

వాటి [ఖురాన్] ప్రకారం….

భార్యాభర్తలు మధ్య గొడవలు తలెత్తితే ముందు వారిద్దరూ కలిసి మాట్లాడుకుని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. అలా కుదరకుంటే ఇద్దరి తరపు బంధువులు, స్నేహితుల రాజీకి కృషిచేయాలి. ఈ ప్రయత్నాలన్నీ విఫలం అయిన పక్షంలో భర్త తలాక్ ను ఆశ్రయించవచ్చు. అయితే ఇందుకు కొన్ని షరతులున్నాయి. కోపం, మద్యం మత్తులో, భార్య రుతుకాలంలో ఉన్నప్పుడు, సంభోగం తర్వాత తలాక్ ఇవ్వరాదు. ఇచ్చినా చెల్లదు. ఈ షరతులకు  ఒప్పుకుని సాక్షుల సమక్షంలో తలాక్ నామా రాయించుకుని తలాక్ చెప్పొచ్చు. ఇలా మొదటిసారి తలాక్ చెప్పాక మూడు నెలల కాలం వరకు అంటే భార్య మూడు రుతుస్రావాల వరకు ఆమె అతని ఇంట్లోనే ఉంటుంది. దాంపత్య సంబంధం మాత్రం ఉండదు. ఈ మూడు నెలల కాలంలో భర్తలో ఏమైనా మార్పు వచ్చి తలాక్ ఇవ్వాలన్న నిర్ణయాన్ని మార్చుకుంటే తలాక్ రద్దు అవుతుంది. ఈ విషయాన్ని భర్త సాక్షులకు చెప్పాలి. ఒకవేళ భర్తలో మార్పు రాకుంటే, మూడు నెలల తర్వాత తలాక్ అమలవుతుంది. అంటే ఇద్దరూ విడాకులు తీసుకున్నట్టే.  దీని తర్వాత మరోసారి తలాక్ చెప్పాల్సిన అవసరం లేదు.

ఒకసారి విడిపోయిన తర్వాత భర్త, తనకు అదే భార్య కావాలనుకుంటే అప్పుడు ఆమెను మళ్లీ నికాహ్ చేసుకోవాలి. కొత్తగా మెహర్ చెల్లించాలి. ఇలా రెండోసారి నికాహ్ చేసుకున్న దంపుతులు మధ్య మళ్లీ విభేదాలు తలెత్తి విడాకులు వరకు వెళితే, తలాక్ ప్రక్రియ మరోసారి జరుగుతుంది. అప్పుడు ఆ దంపతులకు అది రెండవ తలాక్ అవుతుంది. రెండవ తలాక్ అయ్యాక కూడా భర్త, తిరిగి అదే భార్యను కోరుకుంటే మెహర్ చెల్లించి మళ్లీ ఆమెను వివాహం చేసుకోవచ్చు. రెండుసార్లు విడిపోయి మళ్ళీ కలిసిన దంపతుల మధ్య మూడోసారి ఘర్షణలు మొదలై విడాకుల వరకు వెళితే అప్పుడు జరిగేది మూడవ తలాక్. అలా ఆ దంపతుల మధ్య మూడవ తలాక్ జరిగితే ఇక వారిద్దరు మళ్ళీ వివాహం చేసుకునే అవకాశం లేదు. తలాక్ సరైన పద్దతి ఇది. కాని దురదృష్టవశాత్తు ఈ పద్ధతిని పక్కనపెట్టి ఒకేసారి మూడు తలాక్ లు చెప్పేసి పూర్తిస్థాయి తెగతెంపులు చేసుకునే ధోరణి ముస్లిం పురుషుల్లో పెరగడంతోనే సమస్య వచ్చింది. ముస్లిం పురుషుడు తలాక్ అని మూడు సార్లు చెప్పి విడాకులు తీసుకునే పద్దతిని తలాకె బిద్దత్ అంటారు. అయితే ముస్లిం సమాజంలోని అన్ని వర్గాలకు ఈ పద్దతి వర్తించదు. షియాలు దీన్ని పాటించరు. సున్నీల్లో ఒకరైన హనఫీలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

మగవారికే కాదు స్త్రీలకు కూడా విడాకులు ఇచ్చే అవకాశం ఇస్లాంలో ఉంది. ఇందుకు మూడు రకాల పద్దతులు ఉన్నాయి.

  1. మొదటిది భార్యే ఏకపక్షంగా భర్తకు విడాకులు ఇవ్వొచ్చు. దీన్ని ఇస్మా అంటారు. ఇలా ఇవ్వాలంటే వివాహ సమయంలో నికాహ్ నామాలో రాసుకునే షరుతుల్లో దీని గురించి తెలియచేయాల్సి ఉంటుంది.
  2. ఇక భర్త తనను సరిగా చూడకుండా, హింసిస్తుంటే ఖాజీ దగ్గరకు వెళ్లి కారణాలు చెప్పి నికాహ్ రద్దు చేసుకునే అవకాశం స్త్రీలకు ఉంది. దీన్ని ఫిస్క్ నికాహ్ అంటారు. ఖాజీ సహాయంతో పూర్తి మెహర్ ను స్త్రీ పొందవచ్చు.
  3. కొన్ని సందర్భాల్లో భర్త నుంచి విడిపోవాలనుకునే భార్య, విడాకులు ఇవ్వమని అతన్నే కోరుతుంది. దీనిని ఖులా అంటారు. ఒకవేళ భర్త తలాక్ ఒప్పుకోకపోతే ఆమె ఖాజీ ద్వారా విడాకులు తీసుకునే అవకాశం ఉంది.