అయోధ్య రామాలయం నమూనా ఇదే..  - MicTv.in - Telugu News
mictv telugu

అయోధ్య రామాలయం నమూనా ఇదే.. 

August 4, 2020

What Ram Mandir Will Look Like, All Details Here.

ఎన్నో ఏళ్ల కల సాకారమవుతోంది. అయోధ్యలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న  భవ్య రామ మందిరం ఎలా ఉంటుందోనని ప్రతీ ఒక్కరికి ఆత్రుతగా ఉంది. ఈ క్రమంలో నూతనంగా నిర్మిస్తున్న రామ మందిరం నిర్మాణ నమూనాను కేంద్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. నేడు (బుధవారం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామాలయం నిర్మాణ నమూనాకు సంబంధించిన చిత్రాలను విడుదల చేసింది కేంద్రం. ఇప్పటివరకు కనిపిస్తున్న నమూనా కన్నా రెండింతలు పెద్దగా ఆలయాన్ని నిర్మించనున్నారు. కేవలం రాతితో కూడిన స్తంభాలు, గోపురాలతో 161 అడుగల ఎత్తులో మూడు అంతస్తుల రామ మందిరాన్ని నిర్మించనున్నారు. అంతర్గత నిర్మాణ శైలిలో భాగంగా గోపురాలు, గుమ్మటాలు ఎంతో ఆకట్టుకునేలా ఉన్నాయి. 

గుజరాత్‌లోని సోమనాథ్‌ ఆలయాన్ని నిర్మించిన శిల్పి ప్రభాశంకర్ సోంపురా కుమారుడు, ఆర్కిటెక్ట్ చంద్రకాంత్ సోంపురా (77) ఈ అపురూపమైన ఆలయాన్ని నిర్మించనున్నారు. ‘నగర శైలి’ వాస్తు ప్రకారం నిర్మించనున్నట్లు శిల్పి చంద్రకాంత్‌ సోంపురా వెల్లడించారు. ఆలయ నమూనా, నిర్మాణ పనుల కోసం 30 ఏళ్ల కిందటే ఆయనను సంప్రదించారు. దీంతో నాటి నుంచి అయోధ్య సమీపంలో రాతి స్తంభాలు, శిల్పాల పనులు జరుగుతున్నాయి. కాగా, అయోధ్యలోని వివాదస్పద రామ జన్మభూమి శ్రీరాముడికే చెందుతుందని గత ఏడాది నవంబర్‌ 9న సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.