విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో 30 గంటలపాటు 23 ఏళ్ల మానసిక వికలాంగురాలపై ముగ్గురు వ్యక్తులు దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డి, నరకం చూపించిన సంఘటన రాష్ట వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై మహిళ సంఘాలు, సాధారణ మహిళలు ఉద్యమం చేపట్టారు. దీంతో విజయవాడలో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. ఈ నేపథ్యంలో శుక్రవారం బాధితురాలిని నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ.. “ఇది చాలా దుర్మార్గపు ఘటన. రాష్ట్రంలో ఆడ బిడ్డలకు రక్షణ కరవైంది. ఆస్పత్రిలో యువతిపై అత్యాచారం ఏపీకే అవమానం. 30 గంటలపాటు యువతిని బంధించారు. ఏపీలో ఆడబిడ్డలకు రక్షణ ఉందా?. జగన్ ఒంగోలుకు కాదు వెళ్లాల్సింది. ఇక్కడికి రావాలి. మోసపూరిత సున్నా వడ్డీ కోసం ప్రకాశం జిల్లాకు వెళ్లాడం కాదు.
ఆడబిడ్డల విలువ ఈ ప్రభుత్వానికి తెలియదు. జగన్ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వానిది అహంకారమా? ఉన్మాదమా?. జగన్ తన చెంచాలతో మాట్లాడిస్తే భయపడం. ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. ఆ ముగ్గురికి ఉరిశిక్ష వేయాలి. ఈ ఘటనకు నిర్భయ అని పేరు పెట్టాలా, దిశ అని పేరు పెట్టాలా ఏ పేరు పెట్టాలి. ప్రభుత్వానికి సిగ్గుందో లేదో కానీ, నేను మాత్రం సిగ్గుపడుతున్నా” అని చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. అనంతరం టీడీపీ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. బాధితురాలికి రూ. కోటి, ఇల్లు, ఉద్యోగం ఇచ్చి జగన్ ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.