Home > Featured > వాట్సాప్  పేరు మారింది.. ఇకపై బై ఫేస్‌బుక్‌‌గా

వాట్సాప్  పేరు మారింది.. ఇకపై బై ఫేస్‌బుక్‌‌గా

WhatsApp By Facebook

ఇప్పటి వరకు కేవలం ‘వాట్సాప్‌’గానే పరిగణిస్తూ వస్తున్న ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్‌ తన పేరును పొడిగించుకుంటోంది. ఈ యాప్‌ ఇకపై ‘వాట్సాప్‌ బై ఫేస్‌బుక్‌’గా యూజర్లకు కొత్తగా దర్శనమివ్వనుంది. ప్రస్తుతం బీటా (2.19.228) యూజర్లకు ఇది దర్శనమిస్తోంది. త్వరలోనే అందరికీ ఇదే పేరుతో కనిపించనుంది. అయితే యాప్‌లో ఎలాంటి మార్పులు లేకుండా యథావిధిగానే కొనసాగుతూ కేవలం పేరు మాత్రమే మార్చుకోవడం విశేషం. బీటా యూజర్లు వాట్సాప్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళితే..‘వాట్సాప్‌ బై ఫేస్‌బుక్‌’ అని కనిపిస్తుంది. ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ ఉపయోగించే వ్యక్తి.. వాట్సాప్‌ ఖాతా మాత్రమే కలిగిన వ్యక్తితోనూ నేరుగా చాట్‌ చేసే అవకాశం ఉంటుంది. ఈ కీలక మార్పుకు శ్రీకారం చుట్టడంలో భాగంగానే ఫేస్‌బుక్‌ తాజా మార్పు చేపట్టినట్లు సమాచారం. 2020 నాటికి అనుసంధానం జరిగే అవకాశం ఉంది.

ఫేస్‌బుక్‌ మెసెంజర్‌, ఇన్‌స్టా, వాట్సాప్‌ యాప్‌లను అనుసంధానం చేయాలని జుకర్‌బర్గ్‌ నిర్ణయించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. దీంతో ఆయా యాప్స్‌లో ఎలాంటి మార్పులూ జరగనప్పటికీ.. వీటిల్లో ఏ ఇతర ఖాతా లేకపోయినా మూడు సేవలనూ ఉపయోగించుకునే వీలు వుంటుంది.

కాగా, 2012లో ఇన్‌స్టాగ్రామ్‌ను, 2014లో వాట్సాప్‌ను ఫేస్‌బుక్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అవి అప్పటినుంచి ఆ పేర్లతోనే కొనసాగుతున్నాయి. అయితే ఇటీవలే పేరు మార్చాలని ఫేస్‌బుక్‌ నిర్ణయించింది. ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌ బై ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ బై ఫేస్‌బుక్‌ అని మారుస్తున్నట్లు వెల్లడించింది. అందుకనుగుణంగానే వాట్సాప్‌లో తాజా మార్పు చోటుచేసుకుంది. ఈ మార్పు వల్ల వాట్సాప్‌లో ఇప్పటికిప్పుడు వచ్చే మార్పు ఏదీ లేనప్పటికీ భవిష్యత్‌లో కీలక మార్పులకు ఫేస్‌బుక్‌ శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది.

Updated : 19 Aug 2019 7:09 AM GMT
Tags:    
Next Story
Share it
Top