ఏదైనా బంగారు ఆభరణం పొతే మళ్ళీ దొరకడం చాలా కష్టం. ఎంతో వెతికితే తప్ప దొరకదు. కానీ, అదృష్టం ఉంటే ఎన్ని రోజులైనా కూడా పోయిన బంగారం మళ్ళీ దొరుకుతుంది. తాజాగా హైదరాబాద్లో జరిగిన ఓ సంఘటనే ఇందుకు చక్కటి ఉదాహరణ. రాచకొండ పోలీస్స్టేషన్ పరిధిలో జూలై 12, 2019లో సాయికిరణ్ అనే వ్యక్తి గుడికి వెళ్లి తన ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరచి ఉన్నాయి. దీంతో తన ఇంట్లో బంగారం దొంగతనం జరిగిందని గుర్తించాడు. వెంటనే వెళ్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలెట్టారు. ఎంత వెతికినా చోరీ అయిన సొమ్ము దొరకలేదు.
ఆ కేసు అలాగే ఉండి పోయింది. చోరీ జరిగి 15 నెలలు కావస్తుండడంతో పోయిన సొమ్ము గురించి సాయికిరణ్ కుటుంబం మర్చిపోసాగింది. తాజాగా వారి ఇంటి పక్కన ఉండే మహిళ సాయికిరణ్ వాళ్ల ఇంట్లో దొంగిలించిన నగను పెట్టుకొని దిగిన ఫోటోను వాట్సాప్ స్టేటస్ పెట్టింది. ఇది చూసిన సాయికిరణ్ అది తమ ఇంట్లో దొంగిలించినదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేయగా ఆ మహిళ కొడుకు జితేందర్ ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలిసింది. ఈ విషయం అతని తల్లికి తెలిసే జరిగిందని పోలీసులు తెలిపారు. కొడుకును అరెస్ట్ చేసి ఆమెకు కూడా నోటీసులు జారిచేశారు. పోయిందనుకున్న సొమ్ము మళ్ళీ దొరకడంతో సాయికిరణ్ కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.