71వ మిస్ యూనివర్స్ పోటీ జనవరి 14న న్యూ ఓర్లీన్స్, లూసియానాలోని ఎర్నెస్ట్ ఎన్. మోరియల్ కన్వెన్షన్ సెంటర్ లో జరుగనుంది. ఈ పోటీలు చూడడానికి మీరు సిద్ధమా? అయితే ఈ పోటీలను ఎక్కడ, ఏ సమయానికి చూడాలో తెలుసుకోండి. మిస్ యూనివర్స్ ఇండియా దివితా రాయ్ తో సహా 86 మంది మహిళలు శనివారం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అందాల పోటీలో పాల్గొంటారు. డిసెంబర్ 2021లో భారతదేశం తరపున మిస్ యూనివర్స్ టైటిల్ ను గెలుచుకున్న హర్నాజ్ సంధు ఈ సంవత్సరం అందాల పోటీ విజేతను ప్రకటించనున్నారు.
బిగ్ సామ్స్ ఫంకీ నేషన్, బిగ్ ఫ్రీడియా, న్యూ ఓర్లీన్స్ నుంచి రెండు సంగీత బృందాలు ఆ సాయంత్రం ఆడి పాడనున్నాయి. అమెరికన్ వయోలిన్ ప్రాడిజీ అయిన అమండా షా కార్యక్రమం కూడా ఇక్కడ ఉండబోతున్నది. వీరే కాకుండా.. ఇతర ప్రదర్శనకారులైన యొలాండా ఆడమ్స్, ట్యాంక్ అండ్ ది బంగాస్ కూడా ప్రదర్శన ఇవ్వబోతున్నారు. ‘న్యూ ఓర్లీన్స్ నగరం మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ మహిళల చేరిక, సంస్కృతి, సాధికారతను జరుపుకొనే ఒక పండుగ. ఈ నగరానికి అవి విలువలను పంచుకుంటాయి’ అని న్యూ ఓర్లీన్స్ మేయర్ లాటోయా కాంట్రెల్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఎక్కడ.. ఎలా..?
2023 మిస్ యూనివర్స్ పోటీ జనవరి 14న రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. మన దగ్గర జనవరి 15 ఉదయం 5.30 గంటలకు ప్రారంభమవుతుందన్నమాట. ప్రధాన కార్యక్రమం న్యూ ఓర్లీన్స్ లోని ఎర్నెస్ట్ ఎన్. మోరియల్ కన్వెన్షన్ నుంచి ప్రసారం అవుతుంది. అయితే భారతదేశంలోని వీక్షకులు VIACOM 18 యాజమాన్యంలోని Voot లేదా JKN18 అధికారిక Facebook, YouTube ఛానెల్లో గ్రాండ్ ఈవెంట్‌ను ప్రత్యక్షంగా చూడవచ్చు. హోస్ట్ గా స్టీవ్ హార్వే ఐదేళ్ల తర్వాత, మాజీ మిస్ యూనివర్స్ ఒలివియా కల్పో, టీవీ వ్యాఖ్యాత జెన్నీ మై జెంకిన్స్ ఈ సంవత్సరం బాధ్యతలు చేపట్టనున్నారు.
మన అందం..
మిస్ యూనివర్స్ పోటీలో దివితా రాయ్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది. కర్ణాటకి చెందిన ఈమె ఆర్కిటెక్ట్. దివితా కాస్ట్యూమ్ రౌండ్ లో బంగారు పక్షి వేషధారణతో అందరినీ ఆకట్టుకుంది. ఇది వైవిధ్యంతో సామరస్యంగా జీవించే ఆధ్యాత్మిక సారాంశంతో పాటు, మన గొప్ప సాంస్కృతిక వారసత్వ సంపదకు చిహ్నం అంటూ ఇన్ స్టా ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకుంది. ఆమె వేసుకున్న లెహంగా మధ్యప్రదేశ్ లోని చందేరి జిల్లా నుంచి చేతితో నేసిన టిష్యూ ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేశారు. ప్రపంచ పౌరుల పట్ల భారతదేశం కష్ట సమయాల్లో చూపిన పోషణ, సంరక్షణ శక్తిని రెక్కలు సూచిస్తాయి. అంతేకాదు.. ‘ఒకే ప్రపంచం.. ఒకే కుటుంబం’ అనే భావనతో ఈ డ్రెస్ డిజైన్ చేశారు.