When is Raksha Bandhan, August 11 or 12? Know the right date and time here
mictv telugu

రాఖీ పండుగ ఈ రోజేనా? లేదంటే రేపా?

August 11, 2022

సోదర సోదరీమణుల బంధానికి ప్రతీక రాఖీ పండుగ. శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి తిథిని శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అని పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ రక్షా బంధన్ వేడుకలను జరుపుకుంటారు. ఈ పర్వదినాన సోదరీమణులంతా తమ సోదరులకు రాఖీ కట్టి పండుగలా జరుపుకుంటారు. అయితే పండుగ రోజు విషయంలో కొందరికి సందేహాలు కలుగుతున్నాయి. కొందరు పండగ ఈనెల 11వ తేదీ అంటుంటే.. మరికొందరు ఈనెల 12వ తేదీ అని వాదిస్తున్నారు. దీంతో అసలు రాఖీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలో తెలియక చాలామంది అయోమయంలో ఉన్నారు. అయితే పంచాంగం ప్రకారం చూసుకుంటే.. పౌర్ణమి ఘడియలు ఆగస్టు 11న గురువారం ఉదయం 10:37 నుంచి ప్రారంభమవుతాయి. ఈ ఘడియలు ఆగస్టు 12 ఉదయం 7:05 వరకు ఉన్నాయి.

చరిత్ర ప్రకారం రక్షాబంధన్ రోజు భద్ర కాలానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని వేద పండితులు వివరిస్తున్నారు. భద్ర కాలంలో రాఖీ కట్టించుకోవడం అశుభం అని స్పష్టం చేస్తున్నారు. రాఖీ కట్టేందుకు శుభముహూర్తం ఉండాలని అందరూ భావిస్తారు. అయితే ఈ శుభముహూర్తం ఆగస్టు 11న రాత్రి 8:52 నుంచి 9:12 వరకు ఉంది. అంటే ఈ సమయం మధ్యలో సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టవచ్చు. అయితే రాత్రి సమయాన్ని చాలా మంది పట్టించుకోరు. అటు ఆగస్ట్ 12న కూడా పూర్ణిమ తిథి ఉండడంతో ఆ రోజు ఎప్పుడైనా రాఖీ కట్టవచ్చని జ్యోతిష్య నిపుణులు వెల్లడిస్తున్నారు. కాబట్టి రాఖీ పండగను ఆగస్టు 12న జరుపుకుంటే ఎలాంటి అభ్యంతరాలు ఉండవని స్పష్టం చేస్తున్నారు.