మన దేశంలో కరోనా టీకా మొదట వాళ్లకే..  - MicTv.in - Telugu News
mictv telugu

మన దేశంలో కరోనా టీకా మొదట వాళ్లకే.. 

October 2, 2020

ప్రపంచాన్ని కుదిపేసి ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాలను నింపిన కరోనా మహమ్మారిని తరిమెయ్యాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కరోనా వ్యాక్సిన్ తయారీలో వివిధ దేశాల శాస్త్రజ్ఞులు తలమునకలై ఉన్నారు. ఇవాళ వస్తుంది, రేపు వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి నాటికి అందరి ఎదురుచూపులు ఫలించనున్నాయని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా వెల్లడించారు. జనవరి 2021 కల్లా సమర్థవంతంగా కరోనా వ్యాక్సిన్ భారత్‌లో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ ఎప్పుడు అందుబాటులో ఉంటుందనేది స్పష్టంగా చెప్పడం సాధ్యం కాదన్నారు. మానవ పరీక్షల దశ దాటుకుని, ఇన్ఫెక్షన్‌ను ఎదుర్కొనే సామర్థ్యం వ్యాక్సిన్‌కు ఉందని నిరూపణ కావడం వంటి పలు అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని వివరించారు. 

అంతా సవ్యంగా సాగితే వచ్చే ఏడాది ఆరంభంలోనే కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉంటుందని అన్నారు. ‘వ్యాక్సిన్‌ తొలి పంపిణీలో దేశంలో జనాభా అంతటికి సరిపడే డోసులు ప్రాథమికంగా అందుబాటులో ఉండవు. వ్యాక్సిన్‌ సిద్ధం కాగానే, జనాభాకు అనుగుణంగా తయారీ, పెద్ద ఎత్తున సరఫరా చేపట్టడం ప్రధాన సవాళ్లుగా మారతాయి.  భారత్‌లో వ్యాక్సిన్‌ పంపిణీపై ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభమయ్యాయి. వ్యాక్సిన్‌‌ను ప్రాథాన్యతా క్రమంలో ప్రజలకు అందించడం జరుగుతుంది. వైరస్‌ సోకే ముప్పు అధికంగా ఉన్నవారికి ముందుగా వ్యాక్సినేషన్‌ జరుగుతుంది. ఆరోగ్య కార్యకర్తలతో పాటు వైరస్‌పై ముందుండి పోరాడే ఇతర కరోనా యోధులకు వ్యాక్సిన్‌ పంపిణీలో ప్రాధాన్యత ఉంటుంది. వైరస్‌ బారినపడి మరణించే అవకాశం అధికంగా ఉన్న గ్రూపులకు కూడా తొలుత వ్యాక్సిన్‌ ఇస్తారు. ప్రాధాన్యతా జాబితాను రూపొందించి దానికి అనుగుణంగా వ్యవహరిస్తే వ్యాక్సిన్‌ పంపిణీ సమానంగా సాగుతుంది’ అని రణ్‌దీప్ గులేరియా స్పష్టంచేశారు.