Where Is Four TRS MLAS?
mictv telugu

ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎక్కడ?

October 28, 2022

ఫామ్‌హౌజ్ ఎపిసోడ్ ప్రకంపం సృష్టిస్తోంది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. ప్రలోభాల పర్వాన్ని బయటపెట్టిన ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎక్కడ వున్నారు? ఇంతా జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదు. అసలు వాళ్లెక్కడ వున్నారు?ఎందుకీ మౌనం?పెడతామన్న ప్రెస్‌మీట్ ఏమైంది?పెద్దసార్ డైరెక్షన్‌లోనే మీడియా ముందుకొస్తారా?

ఆ నలుగురు ఎమ్మెల్యేలు…

ముచ్చటగా మూడురోజులైంది.ఎర విషయాన్ని బయటపెట్టిన ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, గువ్వలబాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్దన్ రెడ్డి ఎక్కడ కనిపించడం లేదు. బుధవారం ఫామ్‌హౌజ్ నుంచి ప్రగతిభవన్‌కు వెళ్లారు. అక్కడ సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. అసలు ఏం జరిగిందో ఆయనకు వివరించారు. ఈ నలుగురు చేసిన పనికి సీఎం కేసీఆర్ అభినందించారని ఆపార్టీ వర్గాలు చెప్పుకున్నాయి. ఆరోజు రాత్రి అక్కడే బస చేశారని తెలుస్తోంది. తెల్లారి నలుగురు ఎమ్మెల్యేలు ప్రెస్‌మీట్ పెడతారని వార్తలొచ్చాయి. లేదు లేదు సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ వుంటుందని లీక్స్ వచ్చాయి. ఆయనతోపాటే వీళ్లు మీడియా ముందుకొస్తారన్నారు.హైదరాబాద్‌లో కాదు ఢిల్లీలో వుంటుందని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఎవరూ ప్రెస్‌మీట్ నిర్వహించలేదు.

ఎందుకీ మౌనం

కొనుగోళ్ల వ్యవహారంలో ఎమ్మెల్యేలు బాధితులే. ఇది పోలీసులే ఇచ్చిన స్టేట్‌మెంట్. బాధితులై కూడా నలుగురు ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడం లేదు. ఫామ్‌హౌస్‌లో ఏం జరిగిందన్న అసలు విషయం చెబితేనే క్లారిటీ వస్తుంది కదా?ముందుగా ఎవరు ఎవరితో అప్రోచ్ అయ్యారు?ఏం మాట్లాడారు?ఎంత ఆఫర్ చేశారు?డబ్బు సంగతి ఏంటి?రామచంద్రభారతిని కలిపించింది ఎవరు? ఆ బ్యాగుల్లో ఏం ఉన్నాయి? ఈ ప్రశ్నలకు ఆ నలుగురు ఎమ్మెల్యేలే జవాబు ఇవ్వగలరు. ఇంకేవరు ఏమి చెప్పినా అన్నీ ఊహాగానాలే అవుతాయి. ఇప్పటిదాకా విడుదలైన ఆడియో టేపుల్లో అంతా క్లారిటీ లేదు. పైగా ఈ ఆడియోలు ఫేక్ అని బీజేపీ ఆరోపిస్తోంది. అందుకే నలుగురు ఎమ్మెల్యేలు మాట్లాడితే అసలు తెలుస్తోంది. వీరు ఎక్కడ ఉన్నారో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

ఆ ఆరోపణలకేది జవాబు

ఈ వ్యవహారం బయటపడినప్పటి నుంచి బీజేపీ నేతలు ఆ నలుగురు ఎమ్మెల్యేలపై ఆరోపణల వర్షం కురిపిస్తున్నారు. వందకోట్లకు కొనే సీన్ ఉందా అని ఫైర్ అయ్యారు. నెత్తిన రూపాయి పెడితే అర్ధరూపాయికి కూడా ఎవరు కొనరని బండి సంజయ్ అన్నారు. అంతా కేసీఆర్ డైరెక్టన్‌లో ఆడుతున్న డ్రామా అని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.అంతేకాదు వీళ్లకు మళ్లీ గెలిచే సీన్ లేదని అంటున్నారు. ఇన్ని ఆరోపణలు చేస్తున్నా ఎందుకు నలుగురు ఎమ్మెల్యేలు స్పందించడం లేదు. చిన్న చిన్న విషయాలకే మీడియో ముందుకొచ్చే గువ్వలబాలరాజు, రోహిత్ రెడ్డి ఏమైపోయారు. అందరిలో ఇప్పుడు ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.