Where is the logic in the matter of hijab? - Supreme Court
mictv telugu

హిజాబ్ అంశంలో లాజిక్ ఎక్కడ? – సుప్రీంకోర్టు అసహనం

September 7, 2022

పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్ ధరించడం కర్ణాటకలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునివ్వగా, ప్రతివాదులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో బుధవారం సుప్రీంకోర్టులో ఈ అంశంపై వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా పిటిషనర్ తరపున న్యాయవాది దేవ్‌దత్ కమాత్, న్యాయమూర్తి హేమంత్ గుప్తాల మధ్య వాడివేడి వాదోపవాదం సాగింది. హిజాబ్ ధరించడం విద్యార్ధినుల హక్కు అని వాదించగా, ఇష్టమైన దుస్తులు ధరించే హక్కు ఉన్నప్పుడు, వాటిని తొలగించే హక్కు కూడా ఉంటుందా? లాజిక్ లేకుండా మాట్లాడకండి అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అయితే స్కూళ్లలో ఎవరూ దుస్తులు తీసేయరని కామత్ అభిప్రాయపడ్డారు. దీంతో న్యాయమూర్తి ‘అసలు సమస్య ఏంటంటే విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించాలని కేవలం ఓ వర్గం వారు మాత్రమే కోరుకుంటున్నారు. మిగతా విద్యార్ధులు చక్కగా డ్రెస్ కోడ్ పాటిస్తున్నారు. మేం అది ధరిస్తాం, ఇది ధరిస్తామని చెప్పడం లేదు’ అని చెప్పారు. దీనికి కామత్ ‘ఓ వర్గం వారు రుద్రాక్షను ధరిస్తున్నా’రని కోర్టు దృష్టికి తేగా, ‘రుద్రాక్షను షర్టు లోపల వేసుకుంటారు. రుద్రాక్ష ఉందా? లేదా? అని ఎవరూ చెక్ చేయరు’ అని వివరించారు. కాగా, హిజాబ్‌పై దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరుగుతోంది.