which indian films in oscar till now
mictv telugu

ఆస్కార్ కి నామినేట్ అయిన.. భారతీయ చిత్రాలు ఇవే..!

January 24, 2023

which indian films in oscar till now

నేడు మంగళవారం సాయంత్రం ప్రకటించిన ఆస్కార్ నామినేషన్లలో మూడు భారతీయ సినిమాలు వివిధ జాబితాలలో చోటు దక్కించుకున్నాయి. డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఆల్ దట్ బ్రీత్స్, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ది ఎలిఫెంట్ విస్పరర్స్ పోటీలో నిలువగా.. ఒరిజినల్ సాంగ్ విభాగంలో RRR నుండి ‘నాటు నాటు’ పాట ఆస్కార్ నామినేషన్స్ కి ఎంపికైంది.

ఇక 1929లో ఆస్కార్ ప్రారంభం అయినప్పటి నుండి విదేశీ సినిమాలతో పోల్చుకుంటే.. భారతీయ చలనచిత్రాలు అకాడమీ అవార్డ్స్‌లో పెద్దగా రాణించిన చరిత్ర లేదు. అయితే కొంతలో కొంత మన భారతీయ కళాకారులు వివిధ రంగాల్లో అవార్డులను గెలుచుకున్నారు. దానిలో ప్రధానంగా చెప్పుకునే పేరు మదర్ ఇండియా.

మహబూబ్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1957 లో బాలీవుడ్ లో విడుదలైంది. నర్గిస్ దత్, సునీల్ దత్, రాజేంద్ర కుమార్, రాజ్ కుమార్ ముఖ్యపాత్రలు పోషించారు. భారతదేశపు గ్రామ పరిసరాలను ప్రతిబింబించే చిత్రం. ఇందులో భారతీయ సగటు స్త్రీ, తన కుటుంబం కోసం, తన పిల్లలకోసం పడే పాట్లను చక్కగా చిత్రీకరించారు.

ఇక మదర్ ఇండియా తరువాత ఆస్కార్ కి నామినేట్ అయిన మరో మూవీ సలాం బాంబే. మీరా నాయర్ స్వీయ రచన దర్శకత్వంలో తెరకేక్కిన ఈ సినిమా 1988లో విడుదలైంది. బొంబాయిలోని మురికివాడల్లో నివసిస్తున్న పిల్లల రోజువారీ జీవితాన్ని ఈ చిత్రం వివరిస్తుంది. నానా పటేకర్, ఇర్ఫాన్ ఖాన్ వంటి దిగ్గజ నటులు నటించిన ఈ చిత్రం ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా అకాడమీ అవార్డుకు ఎంపికైన భారతదేశం యొక్క రెండవ చిత్రం కావడం విశేషం.

ఇక కొద్దోగొప్పో నేటి తరం ప్రేక్షకులకు గుర్తుండే మరో ఆస్కార్ చిత్రం లగాన్. స్వతంత్య్రానికి ముందు ఒక చిన్న గ్రామంలో జరిగిన కథ ఇది. గ్రామా నివాసితులు, అధిక పన్నుల భారంతో అసాధారణ పరిస్థితుల్లో తమను తాము కాపాడుకోవడానికి బ్రిటిష్ అహంకార అధికారితో పందెం కాసి క్రికెట్ ఆటలో గెలిచి విజయం సాధిస్తారు. లగాన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో విమర్శకుల ప్రశంసలు మరియు అవార్డులతో పాటు అనేక భారతీయ చలన చిత్ర పురస్కారాలను అందుకున్నారు. మదర్ ఇండియా, సలాం బొంబాయి తర్వాత ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా అకాడమీ అవార్డుకు ఎంపికైన మూడవ భారతీయ చిత్రం లగాన్.

ఇక తాజాగా ఈ మూడు చిత్రాలతో పాటు మన తెలుగోడి ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కి ఎంపికైంది. తెలుగు సినిమాకు ఆర్ఆర్ఆర్ తో అరుదైన గౌరవం దక్కింది. ఆర్ఆర్ఆర్ నుండి ‘నాటు నాటు’ పాట ఆస్కార్ నామినేషన్లలో చోటు దక్కించుకుంది. ఇప్పటికే ‘నాటు నాటు’ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ అవార్డు వచ్చిన పాటకే దాదాపు ఆస్కార్ వరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో తెలుగు సినీ ప్రముఖులు, ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా చిత్ర బృందంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మార్చిలో ఆస్కార్ అవార్డులను ప్రకటిస్తారు. కాగా, తెలుగు లేదా టాలీవుడ్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి పాటగా నాటు నాటు నిలిచింది.