ఆడవాళ్ళకు మాత్రమే ఉండే ఒక సమస్య వైట్ డిశ్చార్జ్. ఇది సాధారణంగా అందరు ఆడవాళ్ళకూ ఉంటుంది. పీరియడ్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉంటుంది. మామూలుగా ఉంటే దీన్ని పెద్దగా పట్టించుకొనక్కరలేదు. కానీ ఎక్కువగా అవ్వడం, వాసన, దురద లాంటివి ఉంటే మాత్రం వెంటనే చర్యలు తీసుకోవాలి. వైట్ డిశ్చార్జ్ అనేది చాలా సాధారణంగా కనిపించే సమస్య. దీనివల్ల ఓ పది శాతం మంది ఎలాంటి ఇబ్బంది లేకుండానే ఉంటారు. కొంతమందికి మాత్రం విపరీతమైన దురద, మంట, మూత్రనాళంలో మంట, తెల్లగా పెరుగులా వైట్ డిశ్చార్జ్ అవడం వంటి సమస్యలు ఉంటాయి. ఈ పరిస్థితిని కాండిడియాసిస్ (ఫంగల్ వెజైనల్ ఇన్ఫెక్షన్) అంటారు. దీనికి చికిత్స చేసినా అయిదు శాతం మందిలో మాత్రం ఈ సమస్య మళ్ళీ వస్తుంది.
కొంతమందిలో అల్సర్స్లా కూడా మారుతుంది. మధుమేహం, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్ళలో , యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడే వాళ్ళలో, గర్భనిరోధక మాత్రలు తీసుకుంటున్న వాళ్ళలో ఈ సమస్య ఎక్కువ. డాక్టర్‌ను సంప్రదిస్తే వెజైనల్ పరీక్ష చేసి వైట్ డిశ్చార్జ్ (హై వెజైనల్ స్వాబ్)ను ల్యాబ్‌కు పంపిస్తారు. ఫంగల్ ఇన్ఫెక్షన్ను నిర్ధారణ చేయడానికి మాత్రమే.
అసలు ఈ ఇన్ఫెక్షన్ రాకుండా.. వెజైనా దగ్గర ఎప్పుడూ పొడిగా ఉంచుకోవడం, శుభ్రమైన కాటన్ ఇన్నర్ వేర్‌నే వాడడం, అనవసరంగా యాంటీబయాటిక్స్ జోలికి వెళ్ళకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సమస్యను సరిగ్గా నిర్ధారించి.. దానికి తగిన చికిత్సను అందిస్తే ఈ సమస్య తొంభై శాతం నయమవుతుంది.
కొంతమందికి ప్రెగ్నెన్సీలో కూడా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ తలెత్తుతుంది. డాక్టర్‌ను సంప్రదించి జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకున్నా మళ్లీ ఈ ఇన్ఫెక్షన్ రావడాన్ని రికరెంట్ కాండిడియాసిస్ అంటారు. అలాంటప్పుడు ట్రీట్మెంట్ను ఎక్కువ వారాలు కొనసాగించాల్సి ఉంటుంది.