లావుగా ఉన్నాము తగ్గాలి అనుకున్న వాళ్లు శత్రువులా చూసే పదార్ధం అన్నం. అన్నం చుట్టూ మనకు బోలెడు భ్రమలు ఉన్నాయి. డైట్ అనగానే ప్రతీ ఒక్కరూ రైస్ మానేయండి ముందు అంటారు. దానివల్లే లావు అవుతున్నారు అని చెప్పేస్తారు. చాలా మంది డాక్టర్లు, డైటీషియన్లు కూడా ఇందుకు మినహాయింపు కాదు. కానీ తెల్లనివన్నీ పాలు కాదు నల్లనవన్నీ నీళ్ళూ కాదు అన్నట్టు….లావుకి కారణం బియ్యం, అన్నం మాత్రం కాదు.
ఆసియాలో మనతో పాటూ అన్ని దేశాలు ప్రధానంగా తినేది అన్నమే. ఇంకా మనమే అన్నం, చపాతీ ఇంకా మిల్లెట్స్ అని రకరకాలు తింటాం. కానీ జపాన్, కొరియా దేశాల వాళ్ళు అయితే కేవలం అన్నం మాత్రమే తింటారు. అది కూడా మూడు పూటలా. మరి వాళ్ళు అన్నం తింటున్నా ఫిట్ గా ఉంటున్నారు కదా. ఆరోగ్యంలో, ఫిట్ నెస్ లో జపనీయులు ప్రపంచంలో అందరి కన్నా ముందుంటారు. అక్కడ అందరూ సన్నగా జాజితీగల్లా ఉంటారు. మరి ముప్పూటలా రైస్ తింటూ ఇదెలా సాధ్యమయింది. మాళ్ళు ఎందుకు లావు అవడం లేదు, మనం ఎందుకు అవుతున్నాం. దీని బట్టి అర్ధం అవుతున్నది ఏంటంటే లావు అవ్వడానికి రైస్ మాత్రం కారణం కాదు. అసలు రైస్ మనం తినే చాలా పదార్ధాల కన్నా మేలైనది. బాలీవుడ్ డైటీషియన్ రుచుతా దివాకర్ కూడా ఇదే చెబుతారు. అసలు అన్నం తినడం మానేసే దానికన్నా తింటేనే బరువు తగ్గుతారంట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అదెలానో చూద్దాం రండి.
బరువు తగ్గడానికి రైస్ చేసే హెల్ప్:
1. మొదటి విషయం మనం తినే అన్ని పదార్ధాల కన్నా అన్నం తొందరగా అరుగుతుంది. మన మెటాబాలిజాన్ని బూస్ట్ చేయడంలో రైస్ ముందుంటుంది. ఇది మన బరువును తగ్గిస్తుంది.
2. మనం అన్నం మానేసి తినే ఓట్స్, కినోవా లలో కంటే రైస్ లో ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది. 100 గ్రాముల బాస్మతి రైస్ లో 0.7 గ్రాముల ఫ్యాట్ మాత్రమే ఉంటుంది.
3.అన్నం గులెటిన్ ఫ్రీ. మనం గులెటిన్ ఫ్రీ ఉండాలని ఏవేవో బ్రాండ్ పిళ్ళు, పదార్ధాలు కొనుక్కుంటూ ఉంటాము. అలాంటి వాటికన్నా మన రైస్ ఎంతో బెస్ట్.
4.రైస్ విటమిన్స్, మినరల్స్ రిచ్ ఫుడ్. ఇందులో విటమిన్ బి, మెగ్నీషియం, ప్రోటీన్ ఉన్నాయి. 100 గ్రాముల రైస్ లో 7గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఇది మన బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
5. యాంటీ న్యూట్రిషినల్ కి సంబంధించిన అంశాలేవీ అన్నంలో ఉండవు. ఇందులో ఉండే ఫైటిక్ యాసిడ్ మన బాడికి చేరే మినరల్స్ ను ఇంకేలా చేస్తుంది.
రైస్ తింటూ బరువు ఎలా తగ్గాలి:
కొన్ని పద్ధతులు పాటిస్తే మనం ఎంచక్కా మనకు అలవాటైన అన్నం తింటూనే బరువు తగ్గొచ్చు. అదెలా అంటే….అన్నం తినండి, కానీ ఎక్కువ తినకండి. పోర్షన్ కంట్రోల్ అలవాటు చేసుకోవాలి. ఇది ఒక్క అన్నం విషయంలోనే కాదు మనం తినే అన్ని పదార్ధాలకుూ వర్తిస్తుంది. మనం బరువు పెరగడానికి అతి ముఖ్య కారణం అతిగా తినడం. కాబట్టి పోర్షన్ కంట్రోల్ చేసుకుంటే రైస్ ను హ్యాపీగా తింటూ బరువు తగ్గొచ్చు. అలాగే అన్నం తింటున్నప్పుడు ఎన్ని వీలయితే వెజిటబుల్స్ తినడానికి ప్రయత్నించాలి. అన్నం కన్నా కూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇక ఏం తిన్ని వేపుడు పదార్ధాలు కాకుండా ఉడకబెట్టిన పదార్ధాలు తినడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తుంటే అన్నం తిన్నా కూడా హాయిగా బరువు తగ్గొచ్చు.
మనం తినే ఏ పదార్ధమూ హాని కలిగించేవి కాదు. అలాగే రైస్ కూడా. కాకపోతే రైస్ లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దానికి సమానంగా హై ఫైబర్, ప్రొటీన్ ఉన్న పదార్ధాలు ఎక్కువగా తినాలి. అన్నం తక్కువ తింటూ మిగిలిన పదార్ధాలు ఎక్కువ తింటే బరువు ఆటో మేటిక్ గా తగ్గుతారు. అలాగే డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా అన్నం తినకూడదు అని చెబుతుంటారు. అది కూడా నిజం కాదు. వాళ్ళు కూడా అన్నం చక్కగా తినొచ్చు. కాకపోతే వాళ్ళకి కూడా పైన చెప్పిన రూల్స్ అన్నీ వర్తిస్తాయి.