అదానీ వ్యవహారం బీజెపీని, ప్రధాని మోడీని అంత ఈజీగా వదిలేలా లేదు. ఎవరో ఒకరు ఈ విషయాన్ని లేవనెత్తుతూనే ఉన్నారు. మోడీ వ్యవహారాన్ని తప్పుబడుతూనే ఉన్నారు. ప్రస్తుతం జార్జ్ సొరోస్ అనే వ్యక్తి మీద విపరీతంగా మండిపడుతున్నారు బీజెపీ వాళ్ళు. స్మృతి ఇరానీ సైతం ఈయన చేసిన వ్యాఖ్యల్ని తప్పుబడుతూ మాట్లాడారు. అసలింతకీ ఎవరీ జార్జ్ సొరోస్. ఆయన మోడీని ఏమన్నారు?
జార్జ్ సొరోస్ హంగేరియన్-అమెరికన్ వ్యాపారవేత్త. అత్యంత ధనవంతుడు. ఈయన సంపద విలువ 8.6 బిలియన్ డాలర్లు. అంతేకాదు దాత కూడా. తన సంపదలో 32 బిలియన్లను దానం చేస్తున్నట్లు ప్రకటించడమే కాదు అందులో 15 బిలియన్ డాలర్లు ఇచ్చేశారు కూడా. ఈయన పేరే ఇప్పుడు ఇండియాలో మారుమోగిపోతోంది.
మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ లో జార్జ్ సోరస్ మోడీ మీద చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. అదానీ గ్రూప్ కాంట్రవర్శీ గురించి మాట్లాడుతూ విదేశీ ఇన్వస్టెర్లకు, భారత్ లోని విపక్షాలకు మోడీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందంటూ మాట్లాడారు. మోడీకి, అదానీకి దగ్గర సంబంధాలున్నాయి. దీనివలన ప్రధాని మోడీకి ఇండియా మీద ఉన్న పట్టు బలహీన పడుతుంది. నాకు భారత్ మీద పెద్దగా అవగాహన లేదు కానీ అక్కడ ప్రజాస్వామ్యం మళ్ళీ పునరుద్ధరణ చెందాలని బలంగా కోరుకుంటున్నాని వ్యాఖ్యలు చేశారు.
సోరోస్ మాటలు ఇండియాలో చాలా పెద్ద దుమారాన్నే లేపుతున్నాయి. బీజెపీ వాళ్ళు సోరోస్ మీద మండిపడిపోతున్నారు. ఆయన మాటలు భారత్ మీద దాడి అన్నారు స్మృతి ఇరానీ. విదేశీ శక్తులు భారత ప్రజాస్వామ్యంలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. దీని మీద దేశ ప్రజలందరూ కలిపి స్పందించాలని స్మృతి పిలుపునిచ్చారు. సోరోస్ ఆర్ధిక నేరగాడని తిట్టిపోశారు.
సోరోస్ వ్యాఖ్యల మీద కాంగ్రెస్ వాళ్ళు కూడా స్పందించారు. భారత్ లో ప్రజాస్వామ్యానికి ఎవరికీ సంబంధం లేదు. ఎన్నికల ప్రక్రియ తమ మీద, మిగతా విపక్షాల మీద ఆధారపడి ఉంటుందని అన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేశ్. సోరోస్ లాంటి బయట వ్యక్తులు మన ఎన్నికల ఫలాతాలను ఎలా నిర్ణయిస్తారని ఆయన ప్రశ్నించారు.
జార్జ్ సోరోస్ జ్యూడిష్ వ్యక్తి. హంగేరీలో పుట్టిన సోరోస్ నాజీల ఆక్రమణ సమయంలో అక్కడ నుంచి వెళ్ళిపోయారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చుదువుకున్నారు. చదువు పూర్తయ్యాక అమెరికా వెళ్ళారు. హెడ్జ్ ఫండ్ ను స్థాపించి ప్రపంచ కుబేరుడిగా ఎదిగిన ఈయన ప్రజాస్వామ్యం, పారదర్శకత, బావప్రకటన స్వేచ్ఛను ప్రోత్సహిస్తారు. దానికి సంబంధించిన వ్యక్తులకు, సంస్థలకు నిధులు కూడా ఇస్తారు.ప్రస్తుతం 70 కి పైగా దేశాల్లో ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ ద్వారా మానవ హక్కుల పరిరక్షణ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈయన చేసిన వ్యాఖ్యలు ఇంతకు ముందు కూడా పాపులర్ అయ్యాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఒబామా, హిల్లరీ క్లింటన్, జో బైడెన్ లకు మద్దతు ప్రకటించారు. ఇక మన ప్రధాని మోడీతో పాటూ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో పాటూ డొనాల్డ్ ట్రంప్, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ లకు వ్యతిరేక్తున్నారు.