Who is plotting on Revanth?
mictv telugu

రేవంత్ పై కుట్ర చేస్తున్నదెవరు? తొడ గొట్టేదెవరు..పడగొట్టేదెవరు?

October 21, 2022

Who is plotting on Revanth?

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై కుట్ర చేస్తున్నారా? అధ్యక్ష పదవి నుంచి తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఢిల్లీ కేంద్రంగా ఈ కుట్రకు తెరలేపారా?అసలు కుట్ర చేస్తున్నదెవరు?ఇందులో నిజమెంత? ఇంతకీ తొడ గొట్టేదెవరు..పడగొట్టేదెవరు?

కుట్రలో నిజమెంత?

రేవంత్ రెడ్డి రైజింగ్ లీడర్. కాంగ్రెస్‌లో తిరుగులేదు. ఎదురులేని ఎగిసిపడే కెరటం.అల్లకల్లోంగా మారిన కాంగ్రెస్‌కు యువ దిక్సూచి.తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందన్న తరుణంలో అలా అలలా ఎగిసిపడ్డారు. కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు.సీనియర్లు చిటపటలాడుతున్నా కలుపుకుపోయే ప్రయత్నాలే చేస్తుస్నారు. ఎటాకింగ్ స్పీచ్ తో కాంగ్రెస్ శ్రేణుల్ని కదనరంగంలోకి దూకించారు. మునుగోడులో ముమ్మర ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనపై కుట్ర జరుగుతుందని, పీసీసీ చీఫ్ పదవీ నుంచి తొలగించి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి అసలేం మాట్లాడారు?

కాంగ్రెస్‌లో తనను ఒంటరిని చేయడం కోసం కొందరు కుట్రలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. మీడియా సాక్షిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. కొందరు సీనియర్ నాయకులు తనకు పీసీసీ పదవి వచ్చినందుకు కక్ష పెంచుకుని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి ఒక్క కార్యకర్తకూ చేతులు జోడించి చెబుతున్నాఅందరూ అప్రమత్తం కావాలని అన్నారు. కొందరు సీనియర్లు టీఆర్ఎస్ ,బీజేపీ నేతలతో కలిసి కుట్రలు చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. పార్టీలో ఒంటరివాడిని అయ్యానని, సీనియర్లు తనకు వ్యతిరేకంగా కేసీఆర్ లో కలిసి కుట్ర చేస్తున్నారని వాపోయారు. సీఎం కేసీఆర్ పదిరోజులు ఢిల్లీలో ఉండి ఇదే చేశారని రేవంత్ అన్నారు.

కుట్ర చేయాల్సిన అసరం ఎవరికుంది?

రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల్లో నిజం ఉందా?ఆయన పై కుట్రలు చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది. చేస్తేగిస్తే వారి పార్టీ సీనియర్ నేతలు చేస్తారేమోగానీ మిగతా పార్టీ వాళ్లకు ఏం సంబంధం? ఒకవేళ టీఆర్ఎస్ , బీజేపీ నేతలతో కలిసి కుట్ర చేసినా కాంగ్రెస్ హైకమాండ్ వింటుందా?అసలు వినే ఛాన్సే లేదు. పీసీసీ అధ్యక్ష ఎన్నిక,తొలగింపు పూర్తిగా కాంగ్రెస్ అధిష్ఠానం చేతుల్లోనే వుంటుంది. కాంగ్రెస్ హైకమాండ్ కేసీఆర్ అంటేనే ఒంటికాలుపై లేస్తోంది. ఆయన్ను దారిదాపుల్లోకి రాకుండా చూసుకుంటుంది. ఇక బీజేపీ అంటే రంకెలు వేస్తోంది. కలలో కూడా ఆ పార్టీ నేతల మాట వినే అవకాశమే లేదు. ఇక మిగిలింది కాంగ్రెస్ సీనియర్లే. కుట్ర చేస్తే వీళ్లే చేయాలి.కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్న పరిస్థితుల్లో ఈ సాహసం చేయలేరు.

వీళ్లు ఎన్ని ఫిర్యాదులు చేసినా…

రేవంత్ రెడ్డి పై కాంగ్రెస్ సీనియర్లు మొదటి నుంచి గుర్రుగా ఉన్నారు. అవకాశం దొరికినప్పుడల్లా రుసరుసలాడుతున్నారు. హైకమాండ్ కూ ఫిర్యాదులు చేస్తున్నారు. అయినా కాంగ్రెస్ హైకమాండ్ లైట్ తీసుకుంటుంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ని నడిపించే నాయకుడు కావాలి. వచ్చే ఏడాది ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేలా తయారు చేయాలి. అప్పటిదాకా రేవంత్ కు ఢోకా లేదు. ఎవరెన్ని కుట్రలు చేసినా రేవంత్ ని కదిలించలేదు కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికలు అయ్యేదాకా ఉంచుతుంది.

రేవంత్ వ్యాఖ్యలు ఇందుకేనా

మునుగోడులో సెంటిమెంట్‌ని రగిల్చేందుకు రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడి ఉంటారని కొందరు నేతలు అనుకుంటుకున్నారు. మునుగోడు కాంగ్రెస్ కంచుకోట సెంటిమెంట్ ని రగిల్చాలి. కార్యకర్తల్లో ఉత్తేజం నింపాలి. ప్రత్యర్థి పార్టీల ఎత్తుగడల్ని చిత్తుచేయాలి, ఇలా నాయకుల్లో జోష్ కోసమే మాట్లాడి ఉంటారని టాక్.కానీ రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. ఉద్వేగభరితంగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. అంతర్గత కుమ్ములాటలతో విసిగిపోయి ఇలా మాట్లాడి ఉంటారని ఇంకొందరు అంటున్నారు.
కాంగ్రెస్ హైకమాండ్ స్పందిస్తే గానీ అసలు విషయం తెలియదు.