తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశమంతటా రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న పేరు కె. కవిత. జాతీయ మీడియా ఆమె పూర్తిపేరు కల్వకుంట్ల కవిత అని రాయలేక తిప్పలు పడుతూ కె. కవిత, డాటర్ ఆఫ్ తెలంగాణ సీఎం అంటోంది. ఆమె పేరుతోపాటు రెండు రోజుల నుంచి ప్రముఖంగా వినిపిస్తున్న మరో పేరు సోమా భరత్. ఆయన గురువారం కవిత తరఫున ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వెళ్లి, ఆమె విచారణకు రారని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
కొన్ని పత్రాలను ఆమె తరఫున ఈడీకి అందజేసి మీడియాతో మాట్లాడారు. ఈడీపై, కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు సంధించారు. ఒకవైపు తన క్లైంటుకు వృత్తిపరమైన న్యాయవాదిగా, మరోవైపు అచ్చం బీఆర్ఎస్ నాయకుడిగా చెలరేగిపోయి మీడియాను ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకున్నారు. సోమా భరత్ మొన్నటివరకు తెలంగాణ రాజకీయాలకు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి చిరపరిచితుడే అయినా కవిత కేసును చేపట్టడంతో మరింత ఫోకస్ తెచ్చుకున్నారు.
లిక్కర్ కేసులో..
ఎంపీగా పనిచేసిన కవితకు ఢిల్లీ రాజకీయాలు కొత్తేం కాదు. కాకపోతే ఢిల్లీ లిక్కర్ కేసులో అనుమానితురాలిగా సీబీఐ, ఈడీ లోతుగా విచారిస్తుండడంతో కొంత తడబడుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఈడీలోని సీనియర్ అధికారుల టీఎం విచారణలో ఆమెపై 26 ప్రశ్నలు గుప్పించింది. కీలక సాక్ష్యాలను ఆమె ముందుంచి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈడీ తనపై థర్ట్ డిగ్రీ ప్రయోగించే అవకాశముందని కవిత చెప్పారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఇలాంటి సీరియస్ కేసుల్లో అనుమానితులు, నిందితులు ఆచితూచి స్పందించాల్సి వస్తుంది. ఇందులో న్యాయవాదులది కీలక పాత్ర. పలు కేసుల్లో సక్సెస్ సాధించి, బీఆర్ఎస్ పార్టీకి లీగల్ వ్యవహారాల్లో గైడెన్స్ ఇస్తున్న సోమా భరత్ అయితే కవితను రక్షణ కవచం అడ్డు పెడతారని బీఆర్ఎస్ నేతలు ఆయనను రంగంలోకి దించారు. లిక్కర్ కేసు వివరాలను సమగ్రంగా పరిశీలిచిన భరత్, అన్ని ఆయుధాలతో సిద్ధమయ్యే హస్తిన చేరుకున్నారు. ఈడీ నోటీసలు ఇచ్చినప్పట్నుంచి ఆయన కవితకు సలహాలు ఇస్తున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులతో పలుసార్లు మంతనాలు జరిపారు.
డోన్ట్ ఫియర్..
కవిత తొలిసారి ఈనెల మార్చి 11న ఈడీ విచారణ హాజరయ్యారు. ఈడీ కేసులను స్టడీ చేసిన సోమా భరత్ ఆమె విచారణలో ఎలా మెలగాలో చెప్పి ధైర్యంగా ముందుకు పంపారు. ఈ నెల 16న కవిత ఈడీ విచారణకు గైర్హాజరు కావడంపై అటు ఈడీతోపాటు ఇటు మీడియాకు కూడా వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు న్యాయపర నిబంధనలకు వివరించారు. ఆర్థిక నేరాల కేసుల్లో మహిళలను ఇంటి దగ్గరే విచారించాలని, సాయంత్రం ఆరు గంటలలోపే ప్రశ్నించాలని చెప్పారు. ఈడీ వీటిని పట్టించుకోకుండా తన క్లైంటు హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు.
అయితే ఆయన వాదనల్లో పస లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి కేసుల్లో సోనియా గాంధీ, కనిమొళి వంటి కీలక మహిళా నేతలను కూడా దర్యాప్తు సంస్థలు తమ దగ్గరికే రప్పించకుని విచారించాయని కొందరు న్యాయనిపుణులు గుర్తు చేస్తున్నారు. కేసు విచారణలో సహకరించకపోతే దర్యాప్తు సంస్థలు ప్రత్యేక అధికారాలను ప్రయోగిస్తాయని చెబుతున్నారు. ఏదేమైనా కవితకు ఢిల్లీలో ఈడీ దూకుడు నుంచి ఆయన న్యాయపరమైన చక్రం అడ్డెయ్యడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.
ఉద్యమం నుంచి చైర్మెన్ దాకా..
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం వర్ధమానుకోట గ్రామానికి చెందిన 64 ఏళ్ల భరత్ తొలి నుంచి తెలంగాణ వాది. వైశ్య సామాజిక వర్గానికి చెందినవారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపారు. విద్యార్థి సంఘం ఎన్నికల్లో పీడీఎస్‌యూ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ఎల్ఎల్‌బీ పూర్తయ్యాక ప్రముఖ న్యాయవాది, పౌరహక్కుల నేత కన్నభిరాన్ దగ్గర అసిస్టెంట్ లాయరుగా పనిచేశారు.
తెలంగాణ ఉద్యమ కాలంలో అరెస్టయిన కార్యకర్తలకు ఉచితంగా న్యాయ సేవలు అందించారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావడానికి ముందు, వచ్చిన తర్వాతా ఎన్నో చిక్కుసమస్యల్లో సలహాలు సూచనలు ఇచ్చి పరిష్కారానికి కృషి చేశారు. ఆయన సేవలకు గుర్తించిన కేసీఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. 2022లో ఆయనకు రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ బాధ్యతలను అప్పగించారు.