గోడలు మాట్లాడుతున్నాయి.. ఎవరీ జార్జిరెడ్డి అని.. - MicTv.in - Telugu News
mictv telugu

గోడలు మాట్లాడుతున్నాయి.. ఎవరీ జార్జిరెడ్డి అని..

September 21, 2019

Who is student leader George reddy posters appearing on hyderabad walls

విద్యార్థుల సమస్యలపై పోరాడి ప్రాణాలర్పించిన జార్జి రెడ్డి ఎవరో మీకు తెలుసా? మరిన్ని వివరాలకు #GeorgeReddy అని సెర్చ్ చేయండి. అని హైదరాబాద్‌ నగరంలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఏ గోడ చూసినా.. ఏ మూలన చూసినా? ఇదే పోస్టర్ దర్శనమిస్తోంది. ఫేస్‌బుక్ గోడలపై కూడా ఇవే పోస్టులు షేర్ అవుతున్నాయి. ఇంతకీ జార్జి రెడ్డి ఎవరు? ఎందుకోసం ఈ ప్రచారమని పోస్టర్‌లో సూచించినట్టు గూగుల్‌లో సెర్చ్ చేస్తే జార్జి రెడ్డికి సంబంధించి కొన్ని ఆర్టికల్స్ కనపడ్డాయి.. యూట్యూబ్‌లో కొన్ని వీడియోలు, పాటలు కూడా ఉన్నాయి. వాటిని చూశాక జార్జి రెడ్డి గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు తెలిశాయి. విద్యార్థి నేత అయిన జార్జి రెడ్డి గొప్పతనాన్ని నేటి విద్యార్థి లోకానికి తెలియజేయడానికే ఈ ప్రచారం జరుగుతుందని తెలుస్తోంది. 

ఇంతకీ ఎవరీ జార్జి రెడ్డి?

Image result for george reddy

విద్యార్థి ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్శిటీలో ఒకప్పుడు విప్లవవాద ఉద్యమాలను ముందుండి నడిపించి, చివరకు అదే యూనివర్శిటీలో దారుణంగా హత్యచేయబడ్డ విద్యార్థి నాయకుడు జార్జి రెడ్డి. ‘జీనా హై తో మర్నా సీఖో కదం కదం పర్ లాడ్నా సీఖో’ జార్జి రెడ్డి సమర నినాదం. మరో ప్రపంచ స్వప్నాన్ని సహకారం చేసుకోవాలని, దోపిడీ వ్యవస్థను కూల్చి సమ సమాజ స్థాపన జరపాలని ఉవ్విళ్లూరుతోన్న ఎందరో విద్యార్థులకు పోరు దారి చూపారు జార్జి రెడ్డి. చేగువేరా జీవితం, వియాత్నం ఉద్యమాలు జార్జి రెడ్డిని ఎంతగానో ప్రభావితం చేశాయి. అందుకేనేమో జార్జిని అంతా ‘హైదరాబాద్ చేగువేరా’ అని పిలిచేవారు. 1962 నుంచి 1972 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన విద్యార్థి ఉద్యమాల్లో జార్జి రెడ్డి ముఖ్య భూమిక పోషించారు. ఆనాటి విద్యార్థి రాజకీయాలు, సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, ఉస్మానియా యూనివర్శిటీ పరిణామాలకు వ్యతిరేకంగా జార్జి పోరాడారు. విద్యార్థి దశలోనే ఉద్యమాల వైపు ఆకర్షితుడైన జార్జి రెడ్డి ‘అభ్యుదయ ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య’ (పి.డి.యస్.యు) స్థాపించారు. పి.డి.యస్.యు భారతీయ కమ్యూనిస్టు పార్టీ(ఎంఎల్) విద్యార్థి విభాగం. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థిని.. విద్యార్థులపై సంపన్న వర్గాల విద్యార్థులు చేస్తున్న దాడులకు అడ్డు కట్ట వేశారు. కేవలం ఉద్యమాలు మాత్రమే కాదు చదువులోనూ జార్జి రెడ్డి తన ప్రతిభ కనపరిచారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఫిజిక్స్‌‌లో పీజీ చేసి గోల్డ్ మెడల్ సాధించారు. యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్‌గా ఫిజిక్స్‌లో పీహెచ్‌డి కూడా చేశారు. 1972 జూలై 14 సాయంత్రం యూనివర్సిటీ ఎన్నికల ప్రచారానికి వెళ్లి తిరిగొస్తున్న సమయంలో ఒంటరిగా ఉన్న జార్జిపై 30 మందికి పైగా దుండగలు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మెట్లపై దాడిచేసి కత్తులతో పొడిచి హత్య చేశారు.