పంత్, సంజూ శాంసన్‌లో ఎవరు బెస్ట్ ? జట్టులో స్థానం ఎవరికివ్వాలి ? - MicTv.in - Telugu News
mictv telugu

పంత్, సంజూ శాంసన్‌లో ఎవరు బెస్ట్ ? జట్టులో స్థానం ఎవరికివ్వాలి ?

November 27, 2022

టీం ఇండియా కీపర్ కం బ్యాట్స్ మెన్స్ రిషబ్ పంత్, సంజూ శాంసన్‌. ఇద్దరిలో టాలెంట్ తక్కువేం కాదు. ఎవరికివారే ప్రతిభావంతలు. ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపం మార్చివేసే హిట్టర్లు. అయితే వరుస వైఫల్యాలతో జట్టులో రిషబ్ పంత్ జట్టులో కొనసాగితే.. అవకాశాలు కోసం సంజూ శాంసన్ ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు వీరిద్దరిపై క్రికెట్ అభిమానుల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. రిషబ్ పంత్ను పక్కనబెట్టి సంజూశాంసన్‌కు అవకాశాలు ఇవ్వాలని డిమాండ్‌లు వ్యక్తమవుతున్నాయి. సిరీస్‌‌లకు ఎంపిక చేసి సంజూశాంసన్‌‌ను తుది జట్టులోకి తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎవరు బెస్ట్ అనే ఆలోచనలు మొదలయ్యాయి.

బెంచ్‌కే పరిమితం..

న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపికైన సంజూ రాణించి జట్టులో నిలదొక్కుకోవాలని భావించాడు. అయితే అతడికి రెండు టీ20లోను అవకాశం రాలేదు. వరల్డ్ కప్ లో విఫలమైన పంత్‌కే ఓపెనర్‌గా అవకాశాలు ఇచ్చి జట్టులోకి తీసుకున్నారు. ఇక వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్‌కు సంజూ శాంసన్‌కు శిఖర్ ధావన్ అవకాశం ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో 36 పరుగులు చేసి శ్రేయస్ అయ్యర్‌తో మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో పంత్ కేవలం 15 పరుగులకే పెవిలియన్ చేరాడు. వర్షం కారణంగా రద్దైన రెండో వన్డేలోనూ సంజూ శాంసన్ స్థానం కోల్పోయాడు. అతడి స్థానంలో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేసే దీపక్ హుడాకు అవకాశం కల్పించారు. మరోవైపు మొదటి మ్యాచ్‌లో విఫలమైన రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ హోదాలో స్థానం దక్కించుకున్నాడు.

వన్డే వర్డల్ కప్‌కు ఎవరు బెస్ట్?

టీ 20 వరల్డ్ కప్ ముగిసింది.సెమీస్‌లోనే భారత్ ఇంటి ముఖం పట్టింది. ఇక వచ్చే ఏడాది భారతదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌ కోసం భారత్ సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌గా ఎవరిని తీసుకోవాలి? అనేది పెద్ద సమస్యగా మారింది. రిషబ్, సంజూ శాంసన్ వీరిద్దరిలో ఎవరిని బెస్ట్ అనే చర్చ నడుస్తోంది. అయితే ప్రస్తుతం రిషబ్ పంత్ ఈ రేసులో ముందున్నాడు. కానీ, అతడు నిలకడగా బ్యాటింగ్ చేయట్లేదు. ఇటీవల మ్యాచుల్లో పంత్ తక్కువ స్కోర్లు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. మరోవైపు, సంజూ శాంసన్ టీంలోకి వస్తూపోతూ ఉన్నాడు. అతడికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని వరల్డ్ కప్ కోసం తయారు చేయాలని డిమాండ్‌లు వ్యక్తమవుతున్నాయి.

ఎవరి గణాంకాలు ఏంటీ ?

*రిషబ్ పంత్ 27 వన్డేల్లో 35.62 యావరేజ్‌తో 840 పరుగులు చేశాడు. వాటిలో ఓ సెంచరీ, 5 అర్థసెంచరీలు ఉన్నాయి. అంతర్జాతీయ టీ20లలో 67 మ్యాచ్‌లలో 993 పరుగులు చేశాడు. ఇక్కడ అతడి స్ట్రైక్ రేట్ 125.06గా ఉంది.

*సంజూ శాంసన్ ఆడిన 11 వన్డే మ్యాచ్‌ల్లో 66.00 యావరేజ్‌తో 330 పరుగులు చేశాడు. అతడి ఖాతాలో రెండు అర్థసెంచరీలు ఉన్నాయి. టీ20లలో 16 మ్యాచ్‌లలో 21.14 సగటుతో 296 పరుగులు చేశాడు. శాంసన్ స్ట్రైక్ రేట్ 135. ఇది పంత్ స్ట్రైక్ రేట్ కంటే చాలా ఎక్కువ.

అభిమానుల్లో గొడవ..

ఇద్దరి గణాంకాలను పోల్చుతూ పంత్, శాంసన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా గొడవకు దిగుతున్నారు. శాంసన్‌కు అన్యాయం జరుగుతోందని, అతడికి ఆడే అవకాశం ఇవ్వట్లేదని కొందరు, పంత్ ఎడమచేతి వాటం గల మ్యాచ్ విన్నర్ అని, అందుకే జట్టులో అతడికి స్థానం దక్కిందని కొందరు వాదిస్తున్నారు. పంత్‌ను వన్డేలు, టెస్ట్ లక పరిమితం చేసి కనీసం టీ20ల్లో అయినా శాంసన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇక ముందు ముందు టీంఇండియా మేనేజ్ మెంట్ ఏం చేస్తుందో చూడాలి. వరుసగా విఫలం చెందుతున్న పంత్ కొనసాగిస్తుందా ? లేదా సంజూ శాంసన్ కు అవకాశాలు కల్పిస్తుందా అన్నదానిపై ఆసక్తి నెలకొంది.

Who is the best option among Sanju Samson and Rishabh Pant? in India team