చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఇద్దరిలో సీఎం అభ్యర్ధి ఎవరో ముందు తేల్చుకొని ప్రజలకు స్పష్టం చేయాలని రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అభ్యర్ధిగా చెప్పుకునే పవన్ కల్యాణ్.. చంద్రబాబుతో జత కట్టడమంటే సిద్ధాంతాలు లేకపోవడమేనని ఎద్దేవా చేశారు.
ఆయన పుంగనూరు మున్సిపాలిటీలో చిత్తూరు ఎంపీ ఎంపీ రెడ్డప్పతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. పవన్ ఎత్తుగడలు జనసేన కార్యకర్తలను సైతం విస్తుపోయేలా చేస్తున్నాయన్నారు.
కాపుల ఓట్ల కోసం చంద్రబాబు వల వేస్తున్నారని, రాజకీయం అంటే సినిమా కాదని హితవు పలికారు. 2019లో ఇద్దరూ జతకట్టి కాపుల ఓట్ల కోసం డ్రామాలాడారని గుర్తు చేశారు. సభలు, ర్యాలీలు పెట్టి అమాయకులను బలి చేస్తున్నారని మండిపడ్డారు. చట్టాన్ని గౌరవించలేని వారు సమాజాన్ని ఎలా పాలిస్తారని నిలదీశారు.
చిరంజీవి, బాలకృష్ణలు కూడా అనుమతి తీసుకునే ఈవెంట్లు నిర్వహించారని, పవన్, చంద్రబాబు ఇద్దరూ ప్రభుత్వ జీవోను చదవాలని సూచించారు. కుప్పంలో నకిలీ పేషెంట్లతో ఆస్పత్రిలో చికిత్సలు చేయించి చంద్రబాబు షో చేశారని ఆరోపించారు.