భారత్కు చెందిన మరియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన డాక్-1 మ్యాక్స్ అనే దగ్గు మందు వికటించి ఉజ్బెకిస్తాన్లో 19 మంది చిన్నారులు చనిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మందుతోపాటు మరో మందుపై కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ కంపెనీ తయారుచేసిన రెండు దగ్గు మందులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేవని హెచ్చరించింది. చిన్నపిల్లలకు ఆ మందులు వాడొద్దని సూచిస్తూ తన వెబ్ సైట్ ద్వారా అలర్ట్ చేసింది.
మారియన్ బయోటెక్ తయారు చేసిన రెండు దగ్గు మందులు డాక్-1 మ్యాక్స్ సిరప్, అంబ్రోనల్ సిరప్లను చిన్నపిల్లలకు వినియోగించకూడదని ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వానికి డబ్ల్యూహెచ్వో వెల్లడించింది. వీటిలో విషపూరితమైన ఇథిలీన్ గ్లైకాల్ లేదా ఇథిలీన్ ఉన్నట్లు నిర్ధారించింది. ఈ ఉత్పత్తుల నాణ్యత, భద్రతలకు సంబంధించి మారియన్ బయోటెక్ ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేదని తెలపింది. చిన్నారుల మరణం తర్వాత ఉజ్బెకిస్థాన్ లోని నేషనల్ క్వాలిటీ కంట్రోల్ లేబరేటరీస్ నాణ్యత పరీక్ష చేపట్టిందని పేర్కొంది.