ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఇటీవలే మంకీపాక్స్‌ను గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. తాజాగా మరో కీలక సూచన చేసింది. ఈ వైరస్ ఎక్కువ హోమోసెక్స్ కారణంగా వ్యాప్తి చెందుతుండటంతో.. లైంగిక భాగస్వాములను తగ్గించుకోవాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది. మంకీపాక్స్ ముప్పు నుంచి బయటపడాలంటే ఇదే ఉత్తమ మార్గమని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ ట్రెడోస్ అదనమ్ ఘెబ్రియేసస్ ప్రకటించారు.
‘సాటి మగవాళ్లతో శృంగారంలో పాల్గొనే మగవాళ్లు కొంత కాలం లైంగిక భాగస్వాములను తగ్గించుకోవాలి. కొత్త వారితో లైంగికంగా కలవకూడదు. ఒకవేళ కొత్త వ్యక్తులతో కలసినప్పుడు ఒకరి డీటైల్స్ ను ఒకరు ఇచ్చిపుచ్చుకోవడం వల్ల, అవసరమైతే ఫాలో అప్ చేయడానికి వీలవుతుంద’ని ట్రెడోస్ అభిప్రాయపడ్డారు. ఈ వైరస్ ప్రభావం ఐరోపా, అమెరికా దేశాల్లో ఎక్కువగా ఉందని, ఇప్పటివరకూ బయటపడిన కేసుల్లో 95శాతం ఆ రెండు ప్రాంతాల్లోనే ఉన్నట్లు WHO తెలిపింది. ఇప్పటి వరకూ నమోదైన మంకీపాక్స్ కేసుల్లో 98 శాతం స్వలింగ సంపర్కంలో పాల్గొన్న పురుషులవే కావడం గమనార్హం.