మొదలైన ఉత్కంఠ.. ఎవరికీ ఇస్తారు మంత్రి పదవి? - MicTv.in - Telugu News
mictv telugu

మొదలైన ఉత్కంఠ.. ఎవరికీ ఇస్తారు మంత్రి పదవి?

April 9, 2022

hbdfbdfbgfd

ఆంధ్రప్రదేశ్‌లో ఉత్కంఠ మొదలైంది. మూడేండ్లపాటు మంత్రిగా కొనసాగిన 24 మంది మంత్రులు ఇటీవలే జగన్‌కు రాజీనామా పత్రాలు అందజేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాత మంత్రుల్లో, ఇటు కొత్తగా నియామకం కానున్న మంత్రుల్లో ఎవరికీ మంత్రి పదవి దక్కనుందని టెన్షన్ మొదలైంది. మరోపక్క కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముహుర్తం దగ్గరపడుతుండడంతో అందరిలో టెన్షన్ వాతావరణం షురూ అయింది.

అయితే, ఎవరిని మంత్రులుగా నియమిస్తారు? ప్రస్తుతం కొనసాగుతున్న మంత్రుల్లో ఎవరిని కంటిన్యూ చేస్తారు? అనే విషయాలపై మరికొద్ది గంటల్లో స్పష్టత రానుంది. ఇందుకు సంబంధించి శనివారం జగన్ నివాసంలో కొత్త మంత్రుల జాబితా విషయంలో అధికారులతో కలిసి జగన్ మోహన్ రెడ్డి బీజీబీజీగా ఉన్నారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి కేబినెట్ విస్తరణపై మీడియాతో మాట్లాడుతూ.. ”చివరి క్షణం వరకూ ఈ చర్చలు కొనసాగుతాయి. కొత్తగా ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రులకు రేపు సాయంత్రానికి అధికారికంగా ఆహ్వానాలు పంపిస్తాం. ఆ తర్వాత సీఎంవో అధికారులు వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి ఫోన్లు చేసి సమాచారం ఇస్తారు. మంత్రుల రాజీనామాలతోపాటు, కొత్త మంత్రుల జాబితా కూడా సీల్డ్ కవర్‌లో గవర్నరు పంపిస్తారు” అని అన్నారు.

దీంతో పాత కేబినెట్ నుంచి 8 నుంచి 10 మంది మంత్రులను కొనసాగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కుల సమీకరణ, కొత్త జిల్లాలను పరిగణనలోకి తీసుకొని మిగతావారిని ఎంపిక చేసేందుకు తుది కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న 24 మంది మంత్రుల నుంచి రాజీనామా లేఖలు తీసుకోవడంతో పాతవారిలో ఎవరిని మంత్రివర్గంలో కొనసాగిస్తారనే దానిపై వైసీపీలో జోరుగా చర్చ జరుగుతోంది.

మరోపక్క ఇటీవలే రాష్ట్రంలో 26 జిల్లాలు ఏర్పాటు కావడంతో జిల్లాకో మంత్రి పదవి వస్తుందని వైసీపీ నేతలు, ప్రజలు భావిస్తున్నారు. జిల్లాకో మంత్రి పదవి చొప్పున ఇస్తే, సామాజిక సమీకరణల్లో తేడాలు వస్తున్నట్టు సమాచారం. దీంతో కొందరు పాతవారిని కొనసాగించాలనే దానిపై, సామాజిక సమీకరణలు, జిల్లాల వారీగా మంత్రి పదవుల పంపకంపై సమతూకం పాటించేందుకు తీవ్ర కసరత్తు జరుగుతోందని వైసీపీ కార్యకర్తలు భావిస్తున్నాయి. మరో రెండేళ్లలో ఎన్నికలు కూడా రానుండంటంతో వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని కేబినెట్ కూర్పు ఉంటుందని చర్చించుకుంటున్నారు.