పురుషల ఐపీఎల్-2023కి సమయం దగ్గరపడుతోంది. మార్చి 31 నుంచి సమరం మొదలు కానుంది. ఇంతలోనే కేకేఆర్‌కు ఎదురుదెబ్బ తగిలింది.గాయం కారణగా ఆ టీం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టోర్నీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్‌లో అయ్యర్ వెన్నుగాయంతో ఆటకు దూరమయ్యాడు. గాయాన్ని పరీక్షించిన వైద్యులు 4-5 వారాలు విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో కంగారులతో వన్డే సిరీస్‌కు అయ్యర్ దూరమయ్యాడు. మొదట ఐపీఎల్ ఫస్టాఫ్‌కు మాత్రమే దూరమవుతాడని భావించినా..సీజన్ మొత్తానికే అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది.ఇక అయ్యర్ లేకపోతే కేకేఆర్‌ను నడిపించే నాయకుడు ఎవరూ అనేదానిపై చర్చ మొదలైంది.
కెప్టెన్ రేసులో ప్రధానంగా మూడు పేర్లు వినిపిస్తున్నాయి. అందులో మొదటిది బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్. కేకేఆర్‌తో చానాళ్లుగా ప్రయాణించిన షకీబుల్‌కి ఐపీఎల్‌లో అపార అనుభవం ఉంది. అతడు బంగ్లాదేశ్ టీంను కూడా విజయవంతంగా నడిపిస్తున్నాడు. తాజాగా షకీబ్ అల్ హసన్ సారథ్యంలోనే బంగ్లాదేశ్ సొంతగడ్డపై వరల్డ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను క్లీన్ స్వీప్ చేసింది. బంతితో పాటు బ్యాట్‌తో రాణించే షకీబ్‌కు సారథ్య బాధ్యతలు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.షకీబ్ ఇప్పటి వరకు 71 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 63 వికెట్లతో పాటు 793 పరుగులు చేశాడు. కేకేఆర్ టైటిల్ గెలిచిన 2012, 2014 సీజన్లలో షకీబ్ తన సత్తా చాటాడు.
కేకేఆర్ బౌలర్ టీమ్ సౌథీ కేకేఆర్ కెప్టెన్సీ రేసులో ఉన్నాడు.న్యూజిలాండ్ టెస్ట్ టీమ్ కెప్టెన్ గా సౌథీకి కూడా సారథ్య బాధ్యతలు ఇచ్చే అవకాశాలున్నాయి. ఐపీఎల్‌లో 52 మ్యాచ్‌ల్లో 45 వికెట్లు పడగొట్టాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు.
అయ్యర్ స్థానంలో భారత్ ప్లేయర్‌ను కెప్టెన్ గా నియమించుకోవాలని భావిస్తే నితీశ్ రాణాకే మెండుగా అవకాశాలున్నాయి. కేకేఆర్ టీంతో సుదీర్ఘంగా ప్రయాణం సాగిస్తున్న రాణాకు కెప్టెన్సీ కట్టబెట్టడంపై కూడా యాజమాన్యం ఆలోచన చేస్తోందని వార్తలు వస్తున్నాయి. దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ జట్టును నడిపిన అనుభవం నితీశ్ రాణాకు ఉంది. కేకేఆర్ తరఫున 74 మ్యాచ్‌లు ఆడిన రాణా.. 1744 పరుగులు చేశాడు. ఇందులో 11 హాఫ్ సెంచరీలున్నాయి. బౌలింగ్‌లో 7 వికెట్లు పడగొట్టాడు.
ఈ ముగ్గురే కాకుండా సునీల్ నరైన్, ఆండ్రూ రసెల్, ఫెర్గ్యూసన్, శార్థూల్ ఠాకూర్ కూడా కెప్టెన్ రేసులో ఉన్నారు. గత ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ పెద్దగా ఆకట్టుకోలేదు. పాయింట్స్ టేబుల్లో 7 వస్థానంలో నిలిచింది. మొత్తం టోర్నీలో 14 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ కేవలం ఆరు విజయాలు సాధించి ప్లే ఆఫ్స్‌కి అర్హత సాధించలేకపోయింది.