Who Will Win "Unpredictable" Himachal pradesh
mictv telugu

డబుల్ ఇంజన్ సర్కార్‌కు దమ్కీ తప్పదా?

November 8, 2022

హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ అగ్ని పరీక్ష ఎదుర్కోబోతోంది. డబుల్ ఇంజన్ సర్కార్ నినాదం, మోదీ మేనియా ఉన్నా ప్రభుత్వ వ్యతిరేకత ఆ పార్టీని కలవరపెడుతోంది. దీనికితోడు 1985 నుంచి వస్తున్న దేవభూమి సెంటిమెంట్ కమలాన్ని కంటిమీద కునుకు లేకండా చేస్తోంది. బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నా రెబల్స్ బెడద భయపెడుతోంది. బీజేపీ వరుసగా రెండోసారి అధికారంలో వస్తుందా? రివాజు సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా?ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి.

నువ్వా.. నేనా…

హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల పర్వం రసవత్తరంగా సాగుతోంది. బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీనిస్తుంది. నువ్వా నేనా అన్నట్టు ఢీ కొంటుంది. మూడుదశాబ్ధలుగా ఈ రెండుపార్టీల మధ్య హోరాహోరీగా పోరు సాగుతోంది. ఈ సారి కొత్తగా ఆప్ ఎంటర్ అయింది. ఫలితాలపై పెద్దగా ప్రభావం చూపకపోయినా ఓటు షేరింగ్‌ని తగ్గించే ఛాన్స్ ఉంది. రెండోసారి అధికారంలోకి రావాలని బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తుంది. ప్రభుత్వంపై వ్యతిరేకతను క్యాష్ చేసుకుంటూ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పై ఎత్తులు వేస్తోంది. బీజేపీ తరఫున ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్రమంత్రులు ప్రచారం చేశారు. కాంగ్రెస్ తరఫున ప్రియాంకగాంధీ హిమాచల్ ప్రదేశ్‌ని చుట్టేశారు.భారత్ జోడో యాత్రకు బ్రేక్ రాహుల్ గాంధీ ప్రచారం చేయబోతున్నారు.

సెంటిమెంట్ భయం
హిమాచల్ ప్రదేశ్‌లో 1985 నుంచి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన పార్టీ లేదు. అప్పటినుంచి చెరో టర్మ్ రావడం బీజేపీ, కాంగ్రెస్‌లకు రివాజుగా మారింది. ఇప్పుడు ఈ సెంటిమెంటే కమలాన్ని కలవరపెడుతోంది. తాము చేసిన సంక్షేమ కార్యక్రమాలే విజయపథంలో నిలుపుతాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు. కేంద్రం, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి వేగంగా జరుగుతుందని ప్రజల్లోకి తీసుకెళ్లింది. మోదీ చరిష్మా బీజేపీకి కలిసి వస్తుందని జైరాం ఠాకుర్ ఆశలు పెట్టుకున్నారు. సోమవారం 26 నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరారు. ఎన్నికల ముందు జరిగిన ఈ వలసలు ప్లస్ అవుతాయని బీజేపీ నేతలు అంచానా వేస్తున్నారు.

 

బీజేపీ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్

డబుల్ ఇంజన్ సర్కార్ నినాధమే బీజేపీ ప్రధాన ఆయుధం. మోదీ మేనియా కలిసి వస్తుందన్నది రెండో నమ్మకం.ఇప్పటివరకు సంక్షేమ కార్యక్రమాలు గెలిపిస్తాయనే ధీమా ఆపార్టీ నేతల్లో ఉంది. ప్లస్ పాయింట్ల కన్నా బీజేపీకి మైనస్ పాయింట్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రజా వ్యతిరేకత హిమాచల్ ప్రదేశ్‌లో ఎక్కువగా ఉంది. దాదాపు 20 నియోజకవర్గాల్లో రెబల్స్ బెడద ఉంది. పార్టీ టికెట్లు దక్కని బీజేపీ నాయకులు స్వతంత్రులుగా బరిలోకి దిగారు. వీటికితోడు అగ్నిపథ్ ఆందోళనలు మైనస్‌గా మారే అవకాశం ఉంది.

కాంగ్రెస్ ప్లస్ అండ్ మైనస్

కాంగ్రెస్ ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని నమ్ముకుంది. ఓపీఎస్ విధానాన్ని పునరుద్దరిస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు నెలకు రూ.15 వందల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల్లో అసంతప్తిని క్యాష్ చేసుకునే పనిలో హస్తం నేతలు ఉన్నారు. బీజేపీలోకి భారీగా వలసలు కాంగ్రెస్‌కు మైనస్‌గా మారాయి. కొత్తగా వచ్చిన ఆప్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చే అవకాశం ఉంది.

ఒపీనియన్ పోల్స్ ఏం చెబుతున్నాయంటే…

ఒపీనియన్స్ పోల్స్ అన్ని అటుఇటుగా బీజేపీకే అనుకూలంగా ఉన్నాయి. మొత్తం 68 సీట్లలో బీజేపీకి 45 సీట్లు వస్తాయని ఏబీపీ,సీ ఓటర్ సర్వే చెప్పింది. బీజేపీకి 46 శాతం ఓట్ షేరింగ్ , కాంగ్రెస్‌కు 42 శాతం ఓటు షేరింగ్, ఆప్ కు 2శాతం, ఇతరులకు 10శాతం ఓట్ షేరింగ్ ఉంటుందని తెలిపింది.ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బీజేపీ,కాంగ్రెస్ కు మధ్య తేడా కేవలం 4శాతమే.అలాగే ఆప్ కుడా ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపదని సర్వే తేల్చింది.