అందరి చూపూ చెవేళ్ల వైపే.. ఎందుకంటే ? - MicTv.in - Telugu News
mictv telugu

అందరి చూపూ చెవేళ్ల వైపే.. ఎందుకంటే ?

March 14, 2019

పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే 17 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేసేందుకు అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల కళ్లు చేవెళ్ల పార్లమెంట్ నియోజవర్గంపైనే ఉన్నాయి. ఇక్కడి నుంచి పోటీ పడేందుకు చాలామంది నేతలు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీకి సిద్ధమవుతుండగా.. టీఆర్‌ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, బీజేపీ తరపున కిషన్ రెడ్డి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Who Won Lok Sabha Elections In chevella Parliament Constituency.

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. కాంగ్రెస్ పార్టీని వీడి గులాబీ గూటికి చేరేందుకు అంతా సిద్ధం చేసుకుని, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కూడా ఇప్పటికే భేటీ అయ్యారు. తాను టీఆర్ఎస్‌లో చేరాలంటే తనకు మంత్రి పదవితో పాటు కుమారుడు కార్తీక్ రెడ్డికి చెవేళ్ల ఎంపీ టికెట్ ఇస్తేనే గులాబీ కండువా కప్పుకుంటానని కోరిన విషయం తెలిసిందే. ఇందుకు గులాబీ బాస్ కూడా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ఒకవేళ టీఆర్ఎస్ తరుపున చెవేళ్ల ఎంపీగా కార్తీక్‌ రెడ్డి పోటీకి దిగితే.. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉండదు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన మహేందర్‌రెడ్డి ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దిగి ఎలాగైనా గెలుపొందాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కార్తీక్ రెడ్డి రాకతో మహేందర్ రెడ్డి ఆశలు నీరుగారినట్లు తెలుస్తోంది.

గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరుపున చెవేళ్ల పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన విశ్వేశ్వర్ రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి పట్లోళ్ల కార్తీక్ రెడ్డిపై విజయం సాధించారు. ఈసారి టీఆర్ఎస్ తరపున కార్తీక్ రెడ్డికి ఎంపీ టికెట్ లభిస్తే.. కార్తీక్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి మధ్య పోటాపోటీ నెలకొననుంది. విశ్వేశ్వర్ రెడ్డికి జిల్లాలోని మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చెవేళ్ల, పరిగి, వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల్లో మంచి పట్టు ఉంది. కార్తీక్ రెడ్డికి కూడా జిల్లాలో మంచి పట్టే ఉంది. తల్లిదండ్రుల స్పూర్తితో రాజకీయాల్లోకి అడుగుపెట్టి యూత్ కాంగ్రెస్ లీడర్‌గా పని చేసిన కార్తీక్ రెడ్డి.. గత ఎన్నికల్లో ఎంపీగా కూడా పోటీ చేసి, 3,62,000 ఓట్లు దక్కించుకున్నాడు. టీఆర్‌ఎస్ పార్టీ తనకు టికెట్ ఇస్తే తన గెలుపు 200శాతం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Who Won Lok Sabha Elections In chevella Parliament Constituency