సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తమిళనాడులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు. ఆయన రాజకీయాల్లోకి రావాలని అభిమానులు గట్టిగానే కోరుకున్నారు. ఆయన కూడా రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ ఆయనకు ఆరోగ్య పరమైన సమస్యలు రావటంతో రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అయితే ఇప్పటికీ ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేస్తారేమోనని ఆసక్తిగా, ఆశగా ఎదురు చూసేవాళ్లు చాలా మందే ఉన్నారు. పొలిటికల్‌గా ఆయన ఏ పార్టీకి మద్దతుగా ఉంటారనే దానిపై కూడా చర్చలు జరుగుతూనే ఉంటాయి.
కిడ్నీ సమస్య ఉండటం వల్లే
రాజకీయ ప్రవేశంపై కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతున్నా.. ఆయన మాత్రం దూరంగా ఉన్నారు. తాజాగా, రాజకీయ ప్రవేశంపై తలైవా కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు కిడ్నీ సమస్య ఉండటం వల్లే వైద్యుల సూచనతో రాజకీయాలకు దూరమయ్యానని వెల్లడించారు. శనివారం రాత్రి చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో జరిగిన సేఫియన్స్ హెల్త్ ఫౌండేషన్ రజతోత్సవాల్లో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడితో కలిసి రజినీకాంత్ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కిడ్నీ సమస్యతో చికిత్స పొందుతున్నప్పుడే రాజకీయ ప్రవేశం చేయాలని అనుకున్నట్లు తెలిపారు.
రాజకీయాల్లోకి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు
కానీ తన ఆరోగ్యం పూర్తిగా సహకరించనందువల్లే, డాక్టర్ల సలహా మేరకే ఇక రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని అసలు విషయాన్ని వెల్లడించారు.” 2010 లో నా పర్సనల్ డాక్టర్‌ను కలిసినప్పుడు.. నా కిడ్నీ అప్పటికే 60 శాతం పాడైందనే నిజం తెలిసింది. అప్పుడు, రవిచందర్ అమెరికాలో ఉన్న రొచెస్టర్‌లోని మాయో క్లినిక్‌కు కిడ్నీ మార్పిడి కోసం వెళ్లమని సూచించారు. ఎందుకంటే, ఇక్కడ చాలా ఫార్మాలిటీలు ఉన్నాయి.. దీంతోపాటు సెలబ్రిటీగా కూడా సమస్యలు ఉంటాయి. అందుకే అతను విదేశాలకు వెళ్లాలని ఒత్తిడి చేశారు. అక్కడ నేను కిడ్నీ మార్పిడి చేయించుకున్నాను. ఆరోగ్య పరిస్థితి అప్పటి నుండి సరిగా లేదు. ప్రపంచవ్యాప్తంగా రెండో దశ కొవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో డాక్టర్ రవిచందర్ను మళ్లీ సంప్రదించాను. ఆయన అందరికీ 10 అడుగుల దూరం పాటించి.. మాస్క్ ధరించాలని సలహా ఇచ్చారు. నేను రాజకీయాల్లోకి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ‘ప్రచార సమయంలో వీటికి కట్టుబడి ఉండడం సాధ్యమేనా? ర్యాలీలు, రోడ్‌షోలు నిర్వహించేటప్పుడు ఇది సాధ్యమా?’ అని ప్రశ్నించారు.” డాక్టర్ రవిచందర్ తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరించిన తర్వాతనే రాజకీయ సన్యాసం తీసుకున్నట్లు రజినీ స్పష్టం చేశారు.