Why are you doing it? Who is watching?
mictv telugu

ఎందుకు చేస్తున్నారు? ఎవరు చూస్తున్నారు?

January 6, 2023

కొన్ని ఏళ్ళుగా నడుస్తోంది. నెంబర్ వన్ పొజిషన్. టాప్ రేటింగ్స్ తో నడుస్తున్న షో. దీనంత దరిద్రమైన వీక్లీ షో మరొకటి ఉంది. ఏంటీ పేరు చెప్పడం లేదనుకుంటున్నారా….ఇంత వర్ణించాక ఇంకా చెప్పాలా. అదేనండీ ఈటీవీలో వచ్చే జబర్దస్త్ షో.ఈ వారం ఇది 500 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. అందుకని దీన్ని స్పెషల్ ఎపిసోడ్ గా చెప్పుకున్నారు. అన్నీ మానేసి మంత్రిగా సెటిల్ అయిన రోజా మళ్ళీ నిన్నటి ఎపిసోడ్ కి స్పెషల్ జడ్జ్ గా వచ్చింది కూడా. ఆమెతో పాటూ కృష్ణ బగవాన్, ఇంద్రజ ఉండనే ఉన్నారు వెర్రి నవ్వులు నవ్వడానికి.

ఏ మూహూర్తాన ఈ ప్రోగ్రాం మొదలుపెట్టారో కానీ ఏళ్ళ తరబడి నడుస్తూనే ఉందీ ఈ చెత్త షో. మధ్యలో కోవిడ్ వచ్చింది, కొన్నాళ్ళు ఆగిపోయింది. అప్పుడు పాత ఎపిసోడ్లనే తిప్పికొట్టారు. ఆ దెబ్బతో హమ్మయ్య ఇంక ఆగిపోతుంది అనుకున్నారు కానీ అబ్బే ఎక్కడా. ఈటీవీ వాళ్ళు టీవీ ప్రేక్షకులను అంత తేలిగ్గా వదిలిపెట్టేలా లేరు. నడిపిస్తూనే ఉన్నారు. 500 ఎపిసోడ్లు లాక్కొచ్చారు. ఇంకా ఎంత చెత్తను డంప్ చేస్తారో వేచి చూడాల్సిందే.

నిన్న గురువారం 500 ఎపిసోడ్ ప్రసారం అయింది. అది ఎంత చెత్తగా ఉందంటే నవ్వు రాలేదు సరికదా…వాంతులు వచ్చాయి…అంత దరిద్రంగా ఉంది. జబర్దస్త్ ఎపిసోడ్ నుంచి ఎక్స్ పీరియన్స్ ఉన్న నటులు అందరూ వెళ్ళిపోయారు. అనసూయ కూడా జంప్. ఇక మిగిలింది సైడ్ యాక్టర్లు, కొంతమంది కొత్తవాళ్ళు. అంతకు ముందు స్కిట్ లలో సపోర్టింగ్ ఉండే నటులను లీడర్లుగా చేసేసి, కొంత మంది పాత వాళ్ళు, ఒకరిద్దరు కొత్తవాళ్ళతో షో నడిపిస్తున్నారు. రాకెట్ రాఘవ లాంటి సీనియర్లు అయితే ఇంకా ఉన్నారు. అయితే వాళ్ళు ఇంకా ఎందుకు ఉన్నారో వాళ్ళకూ తెలియదు, మనకంతకంటే తెలియదు. ఇక్క స్కిట్ అంటే ఒక్క స్కిట్ లోనూ నవ్వు రాలేదు. కుళ్ళు కంపు కొట్టే జోకులు, పంచ్ లు. అవే ఆడవాళ్ళను టార్గెట్ చేస్తూ స్కిట్ లు. ఒకడిని ఒకడు తిట్టుకోవడం, ఎగతాళి చేసుకోవడం….తెలుగు వాళ్ళకు ఇంతకు మించి కామెడీ దొరకదు కాబోలు. ఎన్నాళ్ళు చంపుతారో ఈ దిక్కుమాలిన ఐడియాతో.

ఇక నిన్నటి ఎపిసోడ్ మొత్తం భజన ప్రోగ్రామే. చాన్నాళ్ళ తర్వాత రోజా వచ్చింది కదా. ఇక చూస్కోండి ఆమెని పొగడడంతోనే సరిపోయింది అందరికీ. తనతో పాటూ బాగుండదు కదాని కృష్ణ భగవాన్, ఇంద్రజలను కూడా. జబర్దస్త్ జడ్జ్ లు కూడా ఏమీ తీసిపోరు మొదటి నుంచి. నాగబాబు నుంచి ఇప్పటి కృష్ణ బగవాన్ వరకూ తెచ్చుకుని నవ్వేవాళ్ళే. పాపం కృష్ణ భగవాన్ సైలెంట్ గా నవ్వురావడం లేదని సెటైర్లు వేస్తూనే ఉన్నాడు. కానీ డబ్బుల కోసం అనుకుంటా నవ్వుతున్నట్టు యాక్ట్ చేస్తున్నాడు పాపం.

ఇది గురువారం జబర్దస్త్ కత. శుక్రవారం ఎక్స్ ట్రా జబర్దస్త్ గురించి చెప్పాలంటే…ఇందులో అందరూ పాత వాళ్ళే, యాంకర్ కూడా రష్మీనే కానీ అప్పటి లీడ్ కామెడీ యాక్టర్లు అంతా వెళ్ళిపోయారు. ఒక్క ఆటో రాంప్రసాద్ తప్ప. అతనితో పాటూ మరో నలుగురు. మొత్తం 5 స్కిట్ లు నడిస్తే అన్నింటిలోనూ వాళ్ళే కనిపిస్తున్నారు. చేసేవాళ్ళు లేక షో నడిపించాలి కాబట్టి వాళ్ళే అన్ని స్కిట్ లూ చేసేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మొత్తం ఎపిసోడ్ ను అంతా ఇమ్ము నడిపిస్తున్నాడు అంతే.

ఇంత కష్టపడి, ఆపసోపాలు పడిపోతూ రన్ చేస్తున్న ఈ షో ను ఇంకా జనాలు చూస్తున్నారంటే నమ్మబుద్ధి వేయడం లేదు. దీనికి టాప్ రేటింగ్ వస్తోంది అంటే కూడా నమ్మడం కష్టమే. అయినా కూడా ఎందుకు ఈ షోను ఈటీవీ వాళ్ళు కంటిన్చూ చేస్తున్నారో, దీనికి కుష్బూ లాంటి టాప్ యాక్టర్లు ఎందుకు జడ్జ్ లుగా ఎందుకు వస్తున్నారు అనేది మాత్రం మిలియన్ డాలర్ల క్వశ్చనే.