యుద్ధం జరిగితే ప్రపంచానికే తీవ్ర నష్టం!
పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మరోసారి భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కారు. అణ్వస్త్రాలు కలిగి ఉన్న భారత్-పాక్ యుద్ధభేరి మోగిస్తే దాని పర్యవసానాలు ప్రపంచం మొత్తం ఎదుర్కోవాల్సి వస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇమ్రాన్ భారత్‌పై వరుస విమర్శలకు పాల్పడతున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన అనేక అవమానాలు ఎదుర్కుంటున్నా తన బుద్ధి మార్చుకోవడంలేదు. ఇమ్రాన్‌ఖాన్ సహా ఆ దేశ మంత్రులు తరచూ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా శుక్రవారం ఇమ్రాన్ ఖాన్ పాక్ సెక్రటేరియట్ ఎదుట 'కాశ్మీర్ అవర్ ర్యాలీ’ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘అణ్వస్త్రాలు కలిగి ఉన్న భారత్-పాక్ యుద్ధభేరి మోగిస్తే దాని పర్యవసానాలు ప్రపంచం మొత్తం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ భారత్ పీఓకేపై ఏదైనా మిలిటరీ చర్యకు పాల్పడితే దాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు మా సాయుధ బలగాలు ఎలాంటి చర్యకైనా సిద్ధంగా ఉన్నాయి. కశ్మీర్‌లో ముస్లింలు పీడనకు గురవుతుంటే అంతర్జాతీయ సమాజం మౌనంగా ఉంటోంది. కశ్మీర్‌లో ఏం జరుగుతోందో ప్రపంచమంతా చూస్తోంది. అక్కడి ప్రజలు ముస్లింలు కాకపోయి ఉంటే ప్రపంచం మొత్తం వారికి అండగా ఉండేది. దాదాపు 80 లక్షల మంది ప్రజలు నెల రోజులుగా నిషేధాజ్ఞల కింద ఉన్నారు. ఈ విషయాన్ని ఐరాస సర్వసభ్య సమావేశంలో లేవనెత్తుతాం’ అని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు.