కోదండరాంకు కోపం ఎందుకొచ్చిందంటే.... - MicTv.in - Telugu News
mictv telugu

కోదండరాంకు కోపం ఎందుకొచ్చిందంటే….

October 10, 2018

కూటమిలో పొత్తుల విషయంపై ఇంకా క్లారిటీ రావడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు తమకు కావాల్సిన స్థానాల్లో విషయంలో పేచీ పెట్టడం వల్లనేనని  ఆ పార్టీకి చెందినవారు కొందరు అంటున్నారు. ఇప్పటికి పలుమార్లు భేటీ అయిన కూటమి పార్టీ నాయకులు ఎటూ తేల్చకోకుండానే సమావేశాలు ముగించారు. మరో రెండు రోజుల్లో క్లారిటీ ఇవ్వకుంటే తమ  పని తాము చేసుకు పోతామని కోదండరాం హెచ్చరించారు.

సారుకు ఇంతగనం కోపం రావడానికీ ఓ కారణం ఉంది. సమావేశాలు జరిగిన ప్రతీసారి రెండు రోజుల్లో తేలుస్తామని చెప్పడం ఆ తర్వాత దానిగురించి పట్టించుకోకపోవడం జరుగుతూ వస్తున్నది. మీడియాలో సీట్ల పంపకం గురించి రోజుకో వార్త వస్తున్నది.Why  kodandaram angry ఆ వార్తలు కూడా  కాంగ్రెస్ పార్టీ మినహా మిగతా పార్టీల బలాన్ని చాలా తక్కువగా అంచనా వేస్తున్నట్లుగా వస్తున్నాయని జనసమితి నాయకులు కొందరు అంటున్నారు. మూడు సీట్లని కొందరు రాస్తే అంతకంటే కాస్త ఎక్కువ ఉండే అవకాశం ఉందని వార్తలు  వస్తున్నాయి. టిడిపి కూడా ఇరవైకి పైగా సీట్లని, పదిహేనుకు మించి ఇచ్చేది లేదంటున్న కాంగ్రెస్ అంటూ ఇలా పలు రకాలుగా వార్తలు వస్తున్నాయి. ఇదికూడా కూటమి నాయకుల ఆగ్రహానికి కారణం అయి ఉంటుంది.

తమకున్న బలం ఎంత, బలహీనత ఎంత అనే విషయాలు మీడియాలోనే వస్తున్నాయి. మరోవైపు  పొత్తులు, సీట్ల పంపకం, సర్దుబాట్ల గురించి కాంగ్రెస్ నాయకులు పట్టించుకోవడం లేదనే  అభిప్రాయం కూటమి నాయకుల్లో ఉంది. అందుకే వీలైనంత త్వరగా సీట్ల విషయం తేల్చాలని కోదండరాం అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీకిచెందిన సీనియర్ నాయకులు కొందరు  రెండేసి స్థానాలు అడుగుతుండటంతో తమలోతాము ఏమీ తేల్చుకోలేక పోతున్నామని  కొందరు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మిత్ర పక్షాలు కూడా తమ శక్తికి మించి సీట్లు అడుగుతున్నారని,  తేల్చక పోవడానికి ఇదీ ఓ కారణమని మరికొందరు నాయకులు అంటున్నారు.

ఎన్నికల నిర్వాహణ తేదీ ప్రకటించినప్పటికీ   సర్దుబాట్లు, సీట్ల పంపకాల విషయం తేలకపోవడంతో మిత్రపక్షాల నుండి టికెట్లు ఆశిస్తున్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  కారు పార్టీ నాయకులు ప్రచారం ముమ్మరం చేశారు. తాము వెనుకబడి పోతున్నామని వారు అంటున్నారు. ఆలస్యం చేయకుండా వెంటనే టికెట్ల పంపిణీ విషయం తేల్చాలని పట్టుబడుతున్నారు.

కోదండరాం కోపగించుకోవడానికి ఇదే కారణమని అంటున్నారు.  కాంగ్రెస్ నాయకులు ఆయనను కూల్ చేసే ప్రయత్నం చేశారు. పొత్తుల విషయంలో వెంటనే  తేలుస్తామని చెప్పారు. టిడిపి నాయకులు కూడా కోదండరాంను తొందరపడొద్దని సూచన చేశారు.  

పొత్తుల  విషయంలో కాంగ్రెస్  పార్టీ వ్యవహారశైలి పట్ల టిడిపి నాయకులూ తప్పు పడుతున్నారు. పార్టీ ఇక్కడ బలంగా లేదు కాబట్టి, పొత్తుల కోసం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కోసం వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నారు. ఇంకో రెండు మూడు రోజుల్లో  పొత్తులు, సీట్ల పంపకాలు, సర్దుబాట్లపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆలస్యం చేయకుండా ఓ నిర్ణయం తీసుకుంటుందని ఆపార్టీకి చెందిన ముఖ్య నాయకుడొకరు చెప్పారు.