పంచాంగ శ్రవణం పరమార్థం ఏంటి? ఉగాది రోజే ఎందుకు? - MicTv.in - Telugu News
mictv telugu

పంచాంగ శ్రవణం పరమార్థం ఏంటి? ఉగాది రోజే ఎందుకు?

March 25, 2020

Ugadi

తెలుగు ప్రజలకు ఉగాది రోజు పచ్చడి ఎంత ముఖ్యమో పంచాంగ శ్రవణం కూడా అంతే ముఖ్యం. కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ ఏడాది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అనుకుంటారు. అందుకే పంచాంగ శ్రవణం పేరుతో అంతా ఒకచోటకు చేరి భవిష్యత్ గురించి పంతుళ్లను అడిగి తెలుసుకుంటారు. అసలు ఆ రోజు ఎందుకు పంచాంగం వినాలి? దాంట్లో చెప్పింది నిజంగానే జరుగుతుందా? తెలుగు సంవత్సరాది ఉగాదికి పంచాంగ శ్రవణానికి అర్థం, పరమార్థం ఏంటి?  

 

ఉగాది రోజునే ఎందుకు?  

రాశుల గమనాల ఆధారంగా మన పంచాంగ పండితులు భవిష్యత్‌ను ముందుగానే ఊహించి కొన్ని విషయాలను చెబుతారు. పూర్వకాలంలో వాతావరణ విషయాలు, పంటలు పండే అంశాలు, ఏడాది ఎలా ఉండబోతోంది అనే అంశాలను ప్రజలకు చెప్పేవారు. అప్పట్లో అక్షరాస్యత తక్కువగా ఉండటం వల్ల అలాంటి వారికి అప్రమత్తంగా ఈ పంచాంగ శ్రవణం ఉపయోగపడేది. ఇన్ని ఉపయోగాలు ఉంటాయి కాబట్టే సంవత్సరపు తొలిరోజున పంచాంగ శ్రవణం చేసి తీరాలనేది ప్రజల నమ్మకం. అప్పట్లో పురోహితులు కూడా తక్కువగా ఉండటం వల్ల గ్రామ ప్రజలంతా ఒక చోటకు చేరి నలుగురూ కలుసుకుని కష్టసుఖాలను కలబోసుకునే వారు. శుభకార్యాలు, వ్రతాలు, నోములు చేయడానికి అనువైన రోజులను కూడా తెలుసుకోవడానికి ఈ పంచాంగం అనేది ఉపయోగపడుతుంది. 

కాలచక్రంలోని తిథి, వారం, నక్షత్రం, యోగ, కరణాలు పంచాంగాలుగా వ్యవహరిస్తారు. తిథి సంపదను, వారం ఆయుష్షును, నక్షత్రం పాపప్రక్షాళనను, యోగం వ్యాధి నివారణను, కరణం గంగాస్నానం చేసినంత పుణ్యఫలాన్ని కలిగిస్తుందని ప్రజల విశ్వాసం. దీనితో పాటు రాశులు, నక్షత్రాల గమనాల ఆధారంగా రైతులు వర్షాలు ఎలా ఉంటాయి. ఏఏ పంటలకు అనువైన కాలంగా ఉండబోతుంది అనేది తెలుసుకోవడానికి వీలు ఉండేది. ఇలా ఏడాది ప్రారంభంలోనే తెలుసుకుంటే భవిష్యత్ కోసం ప్రణాళికలు వేసుకోవచ్చని భావించే వారు. 

 

రాజకీయ పంచాంగం : 

అప్పట్లో పంచాంగంలో చెప్పినవి జరుగుతాయనే విశ్వాసం చాలా మందిలో ఉండేది. కానీ మారుతున్న కాలానుగుణంగా పంచాంగాల్లో కూడా మార్పులు వచ్చాయి. రాజకీయ పంచాంగాల్లో అయితే ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఉగాది రోజు అన్ని పార్టీలు పంచాంగ శ్రవణాలను ఏర్పాటు చేసుకుంటాయి. దీంట్లో పండితులు ఎవరికి అనుకూలంగా వారు  చెప్పేస్తూ ఉంటారు. రాజయోగం ఉంటుందని, పార్టీకి కలిసి వస్తుందని అన్ని పార్టీ కార్యాలయాల్లోనూ ఒకేలా చెబుతారు. కానీ నిజానికి ఎవరో ఒక్కరికి మాత్రమే అది కలిసి వస్తుంది. అంటే మిగితా వారు కేవలం మెప్పు కోసం చెప్పినట్టుగానే ఉంటుంది.

ఉగాది రోజు ఏడాది ఆరంభంలో పంచాంగ శ్రవణం చేసుకోవడం తెలుగు సంస్కృతిలో ఒక భాగమైపోయింది. ఈ పంచాంగానికి నిజంగానే పవర్ ఉందా? లేదా? అన్నది పక్కన పెడితే కొంత మేరఎదుటివారిలో ఆత్మవిశ్వాసం కల్పించడానికి మాత్రం ఉపయోగపడుతుందనే వాదనలు ఉన్నాయి.