తేజ్‌బహదూర్  నామినేషన్ ఎందుకు తీసుకోలేదు?: సుప్రీం - MicTv.in - Telugu News
mictv telugu

తేజ్‌బహదూర్  నామినేషన్ ఎందుకు తీసుకోలేదు?: సుప్రీం

May 8, 2019

వారణాసి లోక్’సభ నియోజకవర్గంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ‌పై పోటీకి దిగిన బీఎస్‌ఎఫ్ మాజీ జవాను తేజ్ బహదూర్ యాదవ్ సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ బుధవారం విచారించిన సుప్రీంకోర్టు.. బహదూర్ నామినేషన్ ఎందుకు తిరస్కరించారని ఎన్నికల కమిషన్ ను పశ్నించింది. అంతేకాదు ఎందుకు నామినేషన్ తిరస్కరించారో రేపటిలోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

తేజ్‌ను క్రమశిక్షణారాహిత్య చర్యల కింద విధుల నుంచి బహిష్కరించలేదని.. కేవలం అధికారులు ఇచ్చిన ఆహారాన్ని తిరస్కరించినందుకు మాత్రమే తొలగించారని కోర్టుకు చెప్పామని అతని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తెలిపారు. అయినా,  క్రమశిక్షణారాహిత్య చర్యల కింద విధుల నుంచి తొలగించలేదని ఈసీ నుంచి ధ్రువపత్రం తీసుకురావాలని రిటర్నింగ్ ఆఫీసర్‌ కోరుతున్నారని వాపోయారు.

తేజ్ బహదూర్ ఎస్పీ-బీఎస్పీ- ఆర్ఎల్‌‌డీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అతను నామినేషన్ వేసేందుకు వెళ్గగా ఎన్నికల అధికారులు నామినేషన్ ను తిరస్కరించారు. దీంతో తేజ్.. తన నామినేషన్‌ను ఈసీ కావాలనే తిరస్కరించిందని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. సరిహద్దు భద్రతా దళంలో జవానుగా పనిచేసే తేజ్.. అక్కడి జవాన్లకు నాసిరకం ఆహారం అందిస్తున్నారంటూ వీడియోను తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో అతణ్ణి బీఎస్ఎఫ్ విధుల నుంచి తొలగించింది. మరోవైపు..  తనకు రూ. 50 కోట్లు ఇస్తే మోదీని చంపేస్తానంటూ తేజ్‌బహదూర్ చెబుతున్నట్లున్న వీడియో కలకలం రేపింది. అది రెండేళ్ల కిందటిదని చెబుతున్నారు.