Why the craze for RRR abroad?
mictv telugu

విదేశాల్లో ఆర్ఆర్ఆర్‌కు ఎందుకంత క్రేజ్?

January 25, 2023

Oscar nominee RRR: Why the Indian action spectacle is charming the West

గత కొన్ని రోజులుగా ఎవ్వరి నోట విన్నా వినిపిస్తున్న ఒకే ఒక్క మాట ఆర్ఆర్ఆర్. విడుదలై సంవత్సరం అవుతున్నా ఈ సినిమా ఇంకా జనాల నోళ్ళల్లో నానుతూనే ఉంది. భారతదేశంలో కన్నా మిగతా దేశాల్లో మరీ ఎక్కువగా నానుతోంది ఈ సినిమా. మొన్న గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలిచింది. ఇప్పుడేమో ఆస్కార్‌కు నామినేట్ అయింది. దానికి తోడు పెద్ద పెద్ద డైరెక్టర్లందరూ ఈ సినిమాను పొగిడేస్తున్నారు. అసలిదంతా ఎలా మొదలైంది? ఆర్ఆర్ఆర్ ఎందుకింత ఫేమస్ అయిపోయింది?

ఆర్ఆర్ఆర్ సినిమా ఒక సంచలనం. తెలుగులోనే కాదు అన్ని భాషల్లోనూ, దేశాల్లోనూ కూడా. సినిమాకు ముందు నుంచే చాలా హైప్ ఉంది. మామూలుగానే రాజమౌళి సినిమాలు అంటే క్రేజ్ ఉంది జనాల్లో. తీసిన సినిమాలు అన్నీ హిట్  అవ్వడమే కాకుండా బాహుబలితో తెలుగు సినిమాను ఒక లెవల్‌కు తీసుకెళ్ళిపోయాడు. దానికి తోడు ఇద్దరు పెద్ద స్టార్‌లతో ఆర్ఆర్ఆర్ తీయడం ఈ సినిమా లెవల్‌ను పెంచేశాయి. విడుదల క్షణం నుంచే ఇది అందరికీ నచ్చేసింది. కోట్లు కొల్లగొట్టింది. విడుదల చేసిన అన్ని భాషల్లోనూ రికార్డులు సాధించింది. అక్కడితో అయిందా….తర్వాత ఓటీటీలో విడుదల అయింది. కొన్ని వారాలపాటు నెట్ ఫ్లిక్స్‌లో టాప్ 10 లో నిలిచింది. తర్వాత జపాన్ లో విడుదల చేశారు ఈ సినిమా. అక్కడ కూడా బ్లాక్ బస్టర్. జపనీయులు ఆర్ఆర్ఆర్‌ను నెత్తిన పెట్టుకున్నారు. మన స్టార్స్ అక్కడకు వెళితే బ్రహ్మరథం పట్టారు.‌

అసలు మొదట అమెరికాలో ఆర్ఆర్ఆర్ విడుదల చేసినప్పుడు అన్ని తెలుగు సినిమాల్లాగే అనుకున్నారుట. మొదటివారంలో కేవలం ఇండియన్స్ మాత్రమే చూశారుట. కానీ నెమ్మది నెమ్మదిగా మొత్తం పరిస్థితి మారిపోయిందని చెబుతున్నారు న్యూయార్క్ బేస్డ్ క్రిటిక్ సిద్ధాంత్ అడ్లఖా. థియేటర్లకు జనాలు పోటెత్తారు. క్రిటిక్స్ రివ్యూల మీద రివ్యూలు ఇచ్చారు. అన్నీ పాజిటివ్ గానే.   పైగా  పెద్దపెద్ద లీవుడ్ డైరెక్టర్లు ఆర్ఆర్ఆర్ కు రివ్యూలు రాసారు. తర్వాత అమెరికన్ డిస్టిబ్యూటర్లు ఈ సినిమాను విడుదల చేశారు. మామూలుగా పెద్ద స్టార్ల సినిమాలు మన ఇండియాలో విడుదల అయితే థియేటర్లలో ఎలా గోల ఉంటుందో అలా ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తూ అమెరికన్లు అలా గోల చేశారుట.

రెగ్యులర్‌గా ఒకే టైప్ సినిమాలు చూడ్డానికి అలవాటు పడిన విదేశీయులకు ఈ సినిమా ఒక పెద్ద రిలీఫ్. ఇద్దరు స్వతంత్ర పోరాట వీరుల స్ఫూర్తితో తీసిన ఈ కథ ఇక్కడి వారి కొత్తగా కనిపించింది. ఈ సినిమాను అమెరికన్లు మళ్ళీ మళ్ళీ థియేటర్లలో చూడ్డానికైనా రెడీగా ఉన్నారుట. ఇక అవార్డుల గోల మొదలైన దగ్గర నుంచి మొత్తం హైప్ అంతా ఈ సినిమా చుట్టూనే ఉంది. నిజానికి ఆర్ఆర్ఆర్ అఫీషియల్ ఇండియన్ ఎంట్రీ కాదు. కానీ చాలా మ్యాగజైన్లు ఈ సినిమాకు చాలా అవార్డులు ప్రెడిక్ట్ చేశాయి. బెస్ట్ యాక్టర్, బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఇలా బోలెడు క్యాటగిరీల్లో అవార్డులు వస్తాయంటూ గోలగోల చేశాయి. చివరకు ఒక్క ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో మాత్రమే నామినేట్ అయింది. అయితే అది కూడా చాలా ప్రీషియస్ కావడంతో హైప్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది.

ఆర్ఆర్ఆర్ సినిమా కథ ఎలా ఉన్నా….దాన్ని తీసిన విధానం అందరి మనసులనూ కొల్లగొట్టింది. క్రాఫ్టింగ్ అదిరిపోయింది. రాజమౌళి స్టైల్, స్పెక్టాక్యులర్ ఇమేజెస్, కొన్ని అద్భుతమైన సీన్లు ఇలాంటివన్నీ అమెరికన్లను సైతం మెస్మరైజ్ చేశాయి. హాలీవుడ్ మూవీల్లో లేని ఇమాజినేటివ్ స్టోరీ టెల్లింగ్ ఈ సినిమాలో ఉందని అంటున్నారు. అదో గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చిందని చెబుతున్నారు. అందులోని హీరోలిద్దరూ మొదటగా కలిసే సన్నివేశం, ఆ గుర్రం, బైక్ రైడింగ్, బ్రిడ్జ్ సన్నివేశం అద్బుతమని పొగిడేస్తున్నారు. అమెరికన్లకు ఇలాంటివి బాగా నచ్చుతాయని…ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, మార్వెల్ సినిమాల్లో ఇలాంటివే ఉంటయని అంటున్నారు. సినిమా నిండా జనాలు, యాక్షన్ సీన్స్ లాంటి వాటినే విదేశీయులు భారతీయ సినిమాల నుంచి కోరుకుంటారుట. అయితే అర్ధం పర్ధం లేకుండా మాత్రం ఉండకూడదట.

ఇండియాలో ఆర్ఆర్ఆర్ సినిమాకు కలెక్షన్లు రావడంలో పెద్ద విషయమేమీ లేదు. అయితే ఇండియాలో సినిమా విడుదల అయ్యాక అంత మంచి రివ్యూలు రాలేదు. అక్కడ సినిమాలు చాలా పాలిటిక్స్ మయం అయిపోయాయి అంటున్నారు ఫిల్మ్ క్రిటిక్స్. అనవసరంగా హిందూయిజం, రియల్ లైఫ్ హీరోలను స్ఫూర్తిగా తీసుకుని సినిమా తీయడాన్ని చాలా క్రిటిసైజ్ చేశారు మరికొందరు. కానీ వెస్ట్రన్ ఆడియన్స్ ఢిఫరెంట్‌గా చూస్తారు. బ్రిటీష్ వాళ్ళ ఆధిపత్యం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాను వాళ్ళను విపరీతంగా ఆకట్టుకుంది. మామూలు పాలిటిక్స్ కంటే ఇలాంటివే వాళ్ళను ఎక్కువ ఆకర్షిస్తాయిట. దీని గురించి అక్కడ బోలెడు రివ్యూలు రాసారుట కూడా.

అసలు చెప్పాలంటే సినిమాల మీద రివ్యూలే దానిని నిలబెడతాయి అంటున్నారు విమర్శకులు. మూవీ చూసిన దానికన్నా రివ్యూలు చదివి దాని మీద మరింత గ్రాస్ప్ చేసుకుంటారుట. అప్పుడు సినిమాను మరింత ఎంజాయ్ చేస్తారుట కూడా. ఆర్ఆర్ఆర్ కు వచ్చిన రివ్యూలే ఆ సినిమాను లైమ్ లైట్ లో నిలబెట్టాయి. పదినెలలుగా జనాల నోళ్ళల్లో నానేలా చేశాయి. ఏది ఏమైనా ఆర్ఆర్ఆర్ మూవీ భారతీయ సినిమాలకు, హాలీవుడ్ సినిమాలకు మధ్య ఉన్న గీతను చెరిపేసింది. ఇది ఓన్లీ బిగినింగ్ మాత్రమే అంటున్నారు. నెక్స్ట్ రాజమౌళి హాలీవుడ్ సినిమా ఎప్పుడు తీస్తాడా అని అందరూ వెయిట్ చేస్తున్నారుట. పైగా రాజమౌళి అదే అందరి డైరెక్టర్ల కల అని ఒక ఇంటర్వూలో చెప్పారుట కూడా. అందరి కలా తొందరలోనే నెరవేరాలని మనం కూడా కోరుకుందాం.