గుండె సహా అన్నీ అమ్మకానికి పెట్టిన పేద తల్లి  - MicTv.in - Telugu News
mictv telugu

గుండె సహా అన్నీ అమ్మకానికి పెట్టిన పేద తల్లి 

September 23, 2020

పిల్లలను కాపాడుకోవడానికి తల్లి తన ప్రాణాలైనా ఫణంగా పెడుతుంది. పిల్లల కోసం తన సర్వస్వాన్ని వదులుకునే ఓ అమ్మ తననుతాను అమ్ముకోవాడనికి సిద్ధపడింది. తన బిడ్డలను కాపాడుకోవడానికి ఆ తల్లి తన సర్వస్వాన్ని విక్రయించడానికి సిద్ధపడింది. కడుపు తీపి ముందు తన శరీరంలోని ఏ అవయవం గొప్పది కాదని.. అవి పోయి తాను చనిపోయినా తన పిల్లలకు ప్రాణాలు పోయాలని ఆ తల్లి ‘అమ్మ’కానికి సిద్ధపడింది. ఆమె కథ గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు. కేరళలోని కొచ్చిలో ఓ తల్లి పిల్లల కోసం గుండెతో సహా తన అవయవాలు అన్నింటిని అమ్మకానికి పెట్టింది. ఎర్నాకుళంలోని రోడ్డు పక్కన ఓ బోర్డుతో ఓ మహిళ కనిపించింది. ఆ నిరుపేద తల్లి పేరు శాంతి. ఆమెకు ఐదుగురు పిల్లలు ఉన్నారు. తన రెక్కల కష్టంతో ఆ తల్లి తన బిడ్డలను పెంచి పోషించుకుంటోంది. తన ఐదుగురు పిల్లలకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అయితే గత ఏడాది ఆమె పెద్ద కొడుకు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తీసుకెళ్లగా అతనికి బ్రెయిన్ సర్జరీ చేశారు. మరోవైపు రెండు కొడుకు పుట్టుకతోనే మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు. పదకొండేళ్ల కూతురు కూడా రోడ్డు ప్రమాదంతో నరాల వ్యాధి బారిన పడింది. 

వీరందరినీ పోషించేందుకు కుటుంబ బాధ్యతను మోస్తున్న తన మూడో కొడుకు.. కరోనా వైరస్ లాక్‌డౌన్ వల్ల ఉపాధి కోల్పోయాడు. తన చివరి బిడ్డ ఇంకా చదువుకుంటోంది. తమకు పూట గడవటమే కష్టంగా ఉన్న కుటుంబంలో పిల్లల మందులకు డబ్బులు లేక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంది ఆమె. చివరికి ఆ తల్లి భిక్షాటనకు కూడా దిగింది. కానీ ఎవరూ ఆమెకు చిల్లిగవ్వా కూడా దానం చేయలేదు. దీంతో ఈసారి ఆమె ఎవరి సాయం కోరకూడదని, తన అవయవాలను అమ్మి అయినా సరే పిల్లల చికిత్సకు ఏ లోటూ రాకుండా చేయాలని, అప్పులు తీరిపోతాయని భావించింది. ఓ బోర్డును ఏర్పాటు చేసి, దానిపై తన గుండెతో సహా అన్ని అవయవాలను అమ్మేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించింది. వీటితో పాటు ఆమె బ్లడ్‌గ్రూప్ వివరాలను ఆ బోర్డులో తెలిపింది. ఆమె ధీన పరిస్థితిని చూసి చాలా మంది అయ్యోపాపం అంటున్నారు. 

ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.. ‘నేను గర్భంతో ఉన్నప్పుడు భర్త వదిలేశాడు. అప్పుడు నేను డ్రైవింగ్ టీచర్‌గా పని చేస్తూ పిల్లల బాధ్యత తీసుకున్నాను. అప్పుడు నా కూతురి ఆరోగ్యం బాగా లేకపోవటంతో ఆ పనిని వదిలేశాను. చాలా రోజులుగా అద్దె ఇంట్లోనే ఉంటున్నాం. రోజురోజుకు పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. అద్దె కూడా చెల్లించలేని దీనస్థితికి చేరుకున్నాం. దానికి తోడు ముగ్గురు పిల్లలకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అందుకే నా అవయవాలను అమ్మి వారిని బాగు చేసేందుకు సిద్ధమయ్యాను’ అని తెలిపింది ఆమె. కాగా, ఆమె ధీనగాథ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అక్కడి ప్రభుత్వం స్పందించింది. ఆమె కుటుంబానికి తాత్కాలిక నివాసాన్ని ఏర్పాటు చేసింది. వారి ఇంటి అద్దెను లయన్ క్లబ్ చెల్లించటానికి ముందుకొచ్చింది. మరోవైపు ఆమె పిల్లల చికిత్సకు, మందులకు అవసరమయ్యే డబ్బులను ప్రభుత్వమే భరిస్తుందని కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి కేకే శైలజ వెల్లడించారు.