మదర్స్ డే.. ఏం చెబుతుంది? ఎందుకు జరుపుకోవాలి? - MicTv.in - Telugu News
mictv telugu

మదర్స్ డే.. ఏం చెబుతుంది? ఎందుకు జరుపుకోవాలి?

May 8, 2020

దేవుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడని అంటుంటారు. ఈ సృష్టిలో అమ్మ కన్న గొప్పది ఇంకేమీ లేదు. మనల్ని నవమాసాలు మోసి, రక్తమాంసాలు పంచి, పురుటి నొప్పులు భరించి కని, కంటికి రెప్పలాగా కాపాడి, మన ఆలనా పాలనా చూసి, పెంచి పెద్ద చేస్తుంది ఆమె. పేరులోనే ప్రేమను నింపుకున్న అమృత మూర్తి ఆమె. అందుకే అమ్మను ప్రత్యక్ష దైవంగా కొలుస్తారు.

ప్రతి ఏడాది మే నెలలోని రెండో ఆదివారాన్ని మదర్స్ డేగా జరుపుకుంటాం. ఆ రోజు పిల్లలు ఎక్కడ ఉన్నా.. తల్లితో గడపాలనుకుంటారు. ఈ అమ్మల పండుగకు పెద్ద చరిత్ర ఉంది.

 

 

ఎలా వచ్చింది? 

మదర్స్ డేను తొలుత గ్రీస్ దేశంలో నిర్వహించారు. గ్రీస్‌ పురాణ కథల్లో రియా అనే దేవత ఉండేది. ఆమెను గ్రీక్ ప్రజలు మదర్ ఆఫ్ గాడ్స్అని పిలుస్తారు. ఆ దేవతకు ప్రతి సంవత్సరం నివాళులు అర్పించేవారు. దానిని మదర్స్ డేగా గ్రీకు ప్రజలు భావించేవాళ్లు. దాని తరువాత 17వ శతాబ్దంలో బ్రిటన్‌లో మదరింగ్ సండేపేరుతో ఓ ఉత్సవాన్ని నిర్వహించేవారు. ఆ రోజు బ్రిటన్‌లో తల్లులందరికీ సెలవు ప్రకటించి.. దానిని మదరింగ్ సండేగా పిలిచేవారు. ఆ రోజున పిల్లలు తమ అమ్మలకు బహుమతులు, పూలు ఇచ్చేవారు. 19 వ శతాబ్ది నాటికి దాదాపుగా ఈ మదరింగ్ సండే కనుమరుగైనది.

ఆ తర్వాత 1872 లో అమెరికాకు చెందిన జూలియవర్డ్ హోవే అనే మహిళ.. మదర్స్ డేను నిర్వహించాలని ప్రతిపాదించింది. ప్రపంచం శాంతంగా ఉండాలంటే మన కన్నతల్లులను స్మరించుకోవాలి విన్నవించింది. అలా.. మదర్స్ డే జరపాలనే ఆలోచన మొదలైంది. దీంతో 1911 నుంచి ప్రతి ఏడాది మే రెండవ ఆదివారం రోజుని మాతృదినోత్సవంగా జరుపుతున్నారు. 1914 మే 8వ తేదీన అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ మే రెండో ఆదివారాన్ని మదర్స్ డేగా పరిగణించే సంయుక్త తీర్మానంపై సంతకం చేశారు. అప్పటినుంచీ అది అమెరికా సంయుక్త రాష్ట్రాల పండుగ అయింది. అక్కడి నుండి విభిన్న దేశాలలో విభిన్న రకాలుగా అమ్మకు అభివాదం తెలుపుతోందీ ఈ పండుగ.