Why we supported Yashwant in the presidential election .. KTR explanation
mictv telugu

రాష్ట్రపతి ఎన్నికల్లో యశ్వంత్‌కు ఎందుకు మద్దతిచ్చామంటే.. కేటీఆర్ వివరణ

June 27, 2022

రాజ్యాంగ ప‌రిర‌క్ష‌ణ‌కు, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప‌ని చేస్తార‌నే సంపూర్ణ విశ్వాసంతో య‌శ్వంత్ సిన్హా అభ్య‌ర్థిత్వానికి మ‌ద్ద‌తు తెలిపామ‌న్నారు మంత్రి కేటీఆర్. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌ కార్యక్రమానికి హాజరైన మంత్రి.. కేంద్ర నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి వెంట నిలిచామన్నారు. టీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున సంపూర్ణ‌గా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించామని, య‌శ్వంత్ సిన్హాను హైద‌రాబాద్ రావాల‌ని ఆహ్వానించామని చెప్పారు. హైద‌రాబాద్‌లో త‌మ ఎంపీలు, శాస‌న‌స‌భ్యుల‌తో స‌మావేశం ఏర్పాటు చేసి ఆయ‌న‌కు మ‌ద్ద‌తు తెలుపుతామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

జులై 18న ఎన్నికల్లో ఓటు వేయడమే కాదు, అవకాశం ఉంటే ఇతర పార్టీలను కూడా కొరతామంటూ కేటీఆర్ పేర్కొన్నారు. అయితే జుమ్లా.. లేదంటూ హమ్లా అని.. ప్రతి దానికి సమయం వస్తుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం ఏం ఇచ్చిందో వైట్ పేపర్‌ విడుదల చేయాలని.. 8 ఏళ్లల్లో ఏం ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎక్కువ ఇచ్చినట్లు రుజువు చేస్తే తక్షణమే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. మోడీ పాలనలో అత్యధికంగా నిరుద్యోగం పెరిగిందని.. మోడీ పాలనలో విషం తప్ప.. విషయం లేదంటూ విమర్శించారు. రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతి చేశారని.. దళితులకు ఏం ఒరిగిందంటూ కేటీఆర్ ప్రశ్నించారు.

ద్రౌపది ముర్ము మంచి వ్యక్తే కావొచ్చు.. ఆమె గురించి మాకు తెలియదు.. ఒడిశాలో స్టీల్ ప్లాంట్ వ్యతిరేక ఆందోళనలో గిరిజనులను కాల్చిన ఘటనలో ఆమె కనీసం ఖండించలేదంటూ కేటీఆర్ వివరించారు. గిరిజనుల మీద బీజేపీకి నిజంగా ప్రేమ ఉంటే.. 12శాతం రిజర్వేషన్ల కోసం తాము పంపిన బిల్లుకు ఆమోదం చెప్పాలి. కానీ ఇంతవరకు చేయలేదన్నారు. గిరిజన యూనివర్సిటీ విషయం ఇంతవరకు ఏమీ తేల్చలేదన్నారు. తెలంగాణలోని గిరిజన మండలాలను ఏకపక్షంగా తీసుకెళ్లి కలిపారు.. అప్పుడేమి మాట్లాడలేదంటూ వివరించారు.