తమ పెళ్లిరోజు మర్చిపోయిన భర్తకు భార్య ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. తన కుటుంబసభ్యులతో భర్త, అత్తలపై దాడి చేసి చేతివాటం ప్రదర్శించింది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త తన భార్య, ఆమె కుటుంబసభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకెళితే.. ముంబైలోని ఘట్‌కేపర్ ప్రాంతంలో విశాల్ నాంగ్రే, కల్పన దంపతులు నివసిస్తున్నారు. విశాల్ కొరియర్ కంపెనీలో డ్రైవరుగా, కల్పన ఫుడ్ అవుట్ లెట్‌లో పని చేస్తున్నారు. ఈ జంటకు ఫిబ్రవరి 18 2018లో పెళ్లైంది. ఆరు రోజుల క్రితం వచ్చిన ఫిబ్రవరి 18న వారి పెళ్లిరోజు. అయితే పని హడావిడిలో పడి విశాల్ ఆ సంగతి మర్చిపోయాడు.
దీంతో కోపోద్రిక్తురాలైన భార్య కల్పన తన తల్లిదండ్రులు, సోదరులను ఇంటికి పిలిచి మరీ గొడవ చేసింది. మొదట తీవ్రంగా దుర్భాషలాడుతూ భర్తపై దాడి చేసింది. అంతటితో ఆగక అతని తల్లిపై చేయి చేసుకుంది. దీంతో సమస్య పెద్దదిగా మారగా, గాయపడిన తల్లిని ఆస్పత్రికి తరలించిన విశాల్.. దాడి చేసిన భార్య ఆమె తరపువారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొదట ఈ విషయం తెలిసి నివ్వెర పోయిన పోలీసులు తర్వాత సీరియస్ నెస్ అర్ధం చేసుకొని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది.