ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలో జరిగిన ‘సరప్రైజ్’ ‘పుష్ప’లాంటి ఘటన తెలంగాణకూ పాకింది. పెళ్లైన నెలరోజులకే ఓ నవవధువు నిద్రిస్తున్న తన భర్త గొంతు కోసింది. అనంతరం బాధితుడిని ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం నవ వరుడు కోలుకుంటున్నాడు. వివరాలు.. హనుమకొండ జిల్లా దామెర మండలం పసరగొండకు చెందిన రాజు అనే వ్యక్తికి అర్చన అనే యువతితో నెల రోజుల కింద వివాహమైంది. రాజు మల్కపేటలోని క్రషర్లో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో దంపతుల మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ, సోమవారం ఉదయం ఇంట్లో నిద్రిస్తున్న భర్త రాజు గొంతును భార్య అర్చన బ్లేడుతో కోసేసింది. దీంతో తీవ్ర గాయాల పాలైన రాజులను కుటుంబ సభ్యులు హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్సనందించిన వైద్యులు ప్రస్తుతం రాజు పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. కాగా, అర్చన గత కొన్ని రోజులుగా విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్టు స్థానికులు చెప్తున్నారు.