కరోనా వైరస్ సోకితే దానిని దాచిపెట్టి ఏం సాధిస్తాం. అలా చేస్తే చావును ఇష్టంగా స్వాగతం చెప్పినట్టే. అయితే కొంతమంది తనకు కరోనా సోకిందని బయటకు తెలిస్తే ఎవరైనా ఏం అననుకుంటారో.. రేపు తాను రోడ్డు మీదకు వెళ్తే అంటరానివాడిగా చూస్తారేమోననే భయంతో బయటకు చెప్పలేకపోతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన పని అని వైద్యులు, ప్రభుత్వ అధికారులు మొత్తుకుంటున్నారు. ఇలాంటి పని ఏ సామాన్యుడో చేశాడంటే నమ్మొచ్చు కానీ, ఓ బాధ్యత గల వైద్యుడే కరోనాను దాచిపెట్టాడు. తన భార్య శాంపిల్స్ పంపుతూ దాని మీద వారి ఇంటి పనిమనిషి పేరు రాశాడు. దీంతో పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పనిమనిషి ఇంటికి వచ్చిన అధికారులకు అప్పుడు అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీలో చోటు చేసుకుంది. సంగ్రౌలీకి చెందిన అభయ్ రాజన్ సింగ్ ఖుటార్ హెల్త్ సెంటర్లో ప్రభుత్వ వైద్యుడిగా పని చేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్‌లో జూన్ 13న జరిగిన బంధువుల పెళ్లికి సెలవు పెట్టకుండానే కుటుంబంతో సహా వెళ్లాడు.
జూలై మొదటి వారంలో తిరిగి ఇంటికి వచ్చింది ఆ కుటుంబం. అయితే వారిలో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో సదరు వైద్యుడు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించాక పాజిటివ్ వస్తే నిజం బయటపడుతుందనే భయంతో దాన్ని దాచే ప్రయత్నం చేశాడు. తన భార్య శాంపిల్స్‌కు ఇంట్లోని పనిమనిషి పేరిట ల్యాబ్‌కు పంపాడు. రిపోర్ట్‌లో పాజిటివ్‌గా రావడంతో ఆ పనిమనిషి ఇంటి అడ్రస్‌కు వైద్య అధికారులు, పోలీసులు వెళ్లారు. దీంతో అసలు విషయం వెలుగుచూసింది. నిజాన్ని దాచాలని ప్రయత్నించిన సదరు వైద్యుడితో పాటు కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది. దీంతో అందరినీ క్వారంటైన్‌కు తరలించారు. మరోవైపు అప్రమత్తమైన అధికారులు సదరు డాక్టర్‌తో కాంటాక్ట్‌లో ఉన్న వారందరినీ గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటికే ౩౩ మంది ప్రభుత్వ ఉద్యోగులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. తప్పుడు పేరుతో నమూనాలు పంపి, నిజాన్ని దాచి పెట్టే ప్రయత్నం చేసినందుకు వైద్యుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.