భర్త మృతిపై భార్య ఫిర్యాదు.. సగం కాలిన శవానికి పరీక్షలు - MicTv.in - Telugu News
mictv telugu

 భర్త మృతిపై భార్య ఫిర్యాదు.. సగం కాలిన శవానికి పరీక్షలు

October 12, 2020

Wife expresses suspicion of murder, police lifts body with burning pyre

చనిపోయిన వ్యక్తికి కుటుంబ సభ్యులు దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. శవానికి మంటలు కూడా పెట్టారు. శవం సగం తగలబడింది. ఇంతలో పోలీసులు అక్కడికి వచ్చారు. మంటలను ఆర్పేసి శవాన్ని పంచనామా కోసం ఆసుపత్రికి తరలించారు. ఇదంతా చూస్తున్న గ్రామస్తులు, కుటుంబ సభ్యలు విస్మయానికి లోనయ్యారు. ఈ ఘటన 

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘడ్‌లో చోటు చేసుకుంది. రాజ్‌గడ్‌కు చెందిన రేఖాబాయి, ఆమె భర్త ప్రేమ్‌సింగ్‌ల మధ్య నెల రోజుల క్రితం గొడవ జరిగింది. దీంతో రేఖాబాయి తన పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త ఇంటికి రానని తెగేసి చెప్పింది. ఈ క్రమంలో ఇటీవల ప్రేమ్‌సింగ్‌ అనారోగ్యానికి గురై మృతిచెందాడు. 

భర్త చనిపోయాడన్న సమాచారాన్ని భార్యకు చెప్పలేదు అతని కుటుంబ సభ్యులు. అందరూ కలిసి ప్రేమ్‌సింగ్‌ అంత్యక్రియలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న రేఖాబాయి తన భర్త ప్రేమ్‌సింగ్‌ను బంధువులే హత్య చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రేమ్‌సింగ్‌ అంత్యక్రియలు జరిగే ప్రాంతానికి వెళ్లారు. పోలీసులను చూసి మృతుడి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. కాలుతున్న కాష్టాన్ని పోలీసులు ఆర్పారు. అప్పటికే శవం సగం కాలిపోయింది. మృతదేహానికి శవపరీక్షలు నిర్వహించి అనంతరం బంధువులకు అప్పగించారు. పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.