వివాహేతర సంబంధాలు గతంలో గొడవలు, పంచాయతీలకు, విడాకులకు మాత్రమే పరిమితమయ్యేవి. అయితే మనుషుల్లో రానురాను ఆవేశాలు, ఆగ్రహాలు కట్టలు తెంచుకుంటుండడంతో హత్యలకు దారి తీస్తున్నాయి. పరస్పర ఆమోదంతో వివాహేతర సంబంధాలు నెరపడం తప్పేమే కాదని సుప్రీం కోర్టు చెప్పినప్పటికీ అంత సువిశాల హృదయాలు లేని జనాలు మాత్రం నేరాలకు తెగబడుతున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఆర్థిక భద్రత, ఆరోగ్య సమస్యలు, పరువు ప్రతిష్టలు వంటివి.వీటి గురించి అంతగా అవగాహన లేని ఓ ఇల్లాలు.. తన భర్తను పచ్చడి బండతో మోది చంపేసింది. అతడు మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే దీనికి కారణం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈ దారుణం జరిగింది. మారుతీనగర్‌కు చెందిన జక్కంశెట్టి నెలబాలుడ(55) కొన్నాళ్లుగా ఇంటిపట్టన ఉండకుండా మరో మహిళ వద్దకు వెళ్తున్నాడని అతని భార్య పసిగట్టింది. వద్దని వారించింది. గొడవలయ్యాయి. దీంతో కోపం తట్టుకోలేక పచ్చడి బండతో అతని తలపై మోది చంపేసింది. తర్వాత నిర్భయంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది.