అదృష్టం కలిసి వచ్చి రూ. 12 కోట్ల లాటరీ తగిలింది. దాంతో సంతోషంలో మునిగిపోయాడు చైనీస్ వ్యక్తి. అయితే ఆ వెంటనే విడాకులు వస్తాయని అతను ఊహించలేకపోయాడు. కోర్టు దిమ్మతిరిగే తీర్పు ఇవ్వడంతో చివరికి తలదించుకుంటూ వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న నెటిజన్లు యువతికి మద్ధతు ఇస్తూ సదరు వ్యక్తి దురాశపై దుమ్మెత్తి పోస్తున్నారు. చైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ కథనం వివరాలు ఇలా ఉన్నాయి. చైనాకు చెందని జోవ్, లిన్ భార్యాభర్తలు. ఇద్దరు కలిసి ఓ లాటరీ టికెట్ కొన్నారు. అదృష్టం కొద్దీ అదే టికెట్‌కి లాటరీ తగిలి ఈ జంట రూ. 12 కోట్లు (10 మిలియన్ యువాన్లు) నగదు గెల్చుకుంది.
పన్నులు పోను రూ. 10 కోట్ల 22 లక్షల డబ్బును జోవ్ చేతికి ఇచ్చారు లాటరీ నిర్వాహకులు. అయితే ఈ విషయాన్ని భార్య లిన్‌కి చెప్పకుండా దాచిపెట్టాడు భర్త జోవ్. వచ్చిన మొత్తంలో కొంత సోదరికి ఇచ్చాడు. ఇక్కడివరకు ఓకే కానీ ఇక్కడే మనోడు తింగరి పని చేశాడు. భారత కుర్రాడిలా ఆలోచించి తను మర్చిపోలేకపోయిన మాజీ ప్రేయసికి రూ. 85 లక్షలతో మంచి ఫ్లాట్ కొని బహుమతిగా ఇచ్చాడు. కొన్నాళ్లకు భార్య లిన్‌కి పై విషయాలన్నీ తెలిశాయి. ఇన్ని కోట్లు గెలిచినా తనకు చెప్పలేదనే అక్కసుతో పాటు మాజీ ప్రేయసి – ఫ్లాట్ విషయం తెలిసి సలసలా మండిపోయింది. దీంతో ఆలస్యం చేయకుండా తనకు అన్యాయం చేసిన భర్త నుంచి విడాకులు కావాలని కోర్టులో పిటిషన్ వేసింది.
అంతేకాక, లాటరీ డబ్బుతో పాటు మొత్తం ఆస్తిని ఇద్దరికి సమానంగా పంచాలని పిటిషన్‌లో కోరింది. ఇరువైపులా వాదనలు విని సాక్ష్యాధారాలు విన్న కోర్టు భర్త జోవ్‌ని తప్పుపడుతూ తీర్పిచ్చింది. సోదరి, మాజీ ప్రియురాలికి ఖర్చు పెట్టింది కూడా లాటరీ డబ్బేనని గుర్తించి మొత్తం డబ్బులో 60 శాతం అంటే రూ. 7.29 కోట్లను భార్య లిన్‌కు చెల్లించాలని ఆదేశించింది. అలాగే మిగతా ఆస్తిని చెరి సమానంగా పంచింంది.
ఈ వివరాలు సోషల్ మీడియాలో రావడంతో చైనా వ్యాప్తంగా భర్త తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అసలే అమ్మాయిలు దొరక్క ఇబ్బంది పడుతున్న తమ దేశంలో కట్టుకున్న భార్యను ఇంత అవమానిస్తావా? అని యువకులే చీల్చి చెండాతున్నారు. ఈ ఘటనతో గతంలో జరిగిన ఓ సంఘటనను కొందరు గుర్తుకు తెస్తున్నారు. ఓ చైనీయుడికి లాటరీలో రూ. 248 కోట్లు రాగా, ఫ్యామిలీ మెంబర్స్‌కి తెలియకుండా దాచాడు. ఇంత డబ్బు వచ్చిందని తెలిస్తే వారు కష్టపడకుండా సోమరిపోతులవుతారని, సుఖాలకు అలవాటు పడి చెడిపోతారనే ఉద్దేశంతో ఇలా చేశానని చెప్పుకొచ్చాడు. జోవ్ కూడా అదే ఉద్దేశంతో చేశాడేమోనని కొందరు అతనిపై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. పాపం లాటరీ గెలిచాననుకున్నాడు కానీ దాని వెనుకనే విడాకులు కూడా వస్తాయని ఊహించలేకపోయాడని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు.