భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం ఉప్పల్ స్టేడియంలో తొలి వన్డే జరిగిన విషయం తెలిసిందే. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచులో భారత్ విజయం సాధించి సిరిస్‌లో బోణీ చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ గిల్ డబుల్ సెంచరీతో 349 పరుగులు చేయగా, లక్ష్యానికి దగ్గరగా వచ్చిన కివీస్ 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఇన్నింగ్స్ 40వ ఓవర్లో హార్ధిక్ పాండ్యాకి ఔట్ ఇచ్చిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బంతి బ్యాట్‌కి తాకకుండా, వికెట్లను ముద్దాడకుండా కివీస్ కెప్టెన్ కం వికెట్ కీపర్ లాథమ్ చేతుల్లోకి వెళ్లింది. కానీ లాథమ్ తెలివిగా తన బ్లౌజులను వికెట్లను తాకించి బెయిల్స్ పడగొట్టాడు. కివీస్ ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో నిర్ణయం థర్డ్ అంపైర్ వద్దకు వెళ్లింది. అప్పటికి హార్ధిక్ కాస్త జోరు పెంచి మంచి టచ్‌లోకి వచ్చాడు. కానీ థర్డ్ అంపైర్ మాత్రం అవుట్ అంటూ షాకింగ్ డెసిషన్ ఇవ్వడంతో అభిమానులంతా ఆశ్చర్యపోయారు. ఇదసలు ఎలా అవుటవుతుందని చర్చించడం మొదలెట్టారు.
దీనికి ఎవరి దగ్గరా సమాధానం లేకుండా పోయింది. దీనిపై హార్ధిక్ భార్య నటాషా కూడా ఆగ్రహానికి గురై అంపైర్లను ప్రశ్నించింది. సోషల్ మీడియా వేదికగా హార్దిక్ అవుట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్ చేసి ‘బంతి బ్యాట్‌కు, వికెట్లకు తాకకుండా ఎలా అవుట్ ఇస్తారు? అంటూ నిలదీసింది. ఇంత జరుగుతున్నా అంపైర్ల నుంచి గానీ, ఐసీసీ నుంచి గానీ ఎలాంటి వివరణ రాలేదు. డబుల్ సెంచరీ వీరుడు గిల్‌కు కూడా లాథమ్ ఇలాగే చేశాడు. కానీ మోసం బయటపడడంతో తప్పించుకున్నాడు. కానీ హార్ధిక్ మాత్రం బలవ్వాల్సి వచ్చింది. అటు రెండో వన్డే శనివారం జరుగనుంది.