మరో ప్రధాని భార్యకూ సోకిన కరోనా వైరస్ - MicTv.in - Telugu News
mictv telugu

మరో ప్రధాని భార్యకూ సోకిన కరోనా వైరస్

March 15, 2020

Wife of Spain’s prime minister tests positive for coronavirus

కరోనా వైరస్ సామాన్యులతో పాటు దేశాధినేతలను, మంత్రులను కూడా వణికిస్తోంది. ఇప్పటికే ఇరాన్, బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రులకూ.. కెనడా ప్రధానమంత్రి భార్యకు కరోనా వైరస్ సోకిన సంగతి తెల్సిందే. తాజాగా స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ భార్య బెగోనా సాంచెజ్‌కి కూడా కరోనా వైరస్ సోకినట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. భార్యా భర్తలిద్దరూ తమ అధికారిక నివాసంలోనే ఉన్నారని ప్రధాని కార్యాలయం పేర్కొంది. కాగా, వీరు సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉన్నట్టు భావిస్తున్నారు. ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్త చర్యలూ తీసుకున్నదని, పెడ్రో సాంచెజ్, ఆయన భార్య ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన పని లేదని తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే స్పెయిన్‌లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. గత 24 గంటల్లో ఏకంగా 1500 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కరి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 5,753కు చేరుకుంది. వీటిలో దాదాపు మూడు వేల మంది బాధితులు దేశ రాజధాని మాడ్రిడ్‌కు చెందినవారే కావడం ఆందోళనకు గురి చేస్తున్న విషయం. కాగా, శుక్రవారం నాటికి ఆ దేశంలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 120కి చేరుకుంది. మరోవైపు ఒకే రోజు 1500 కేసులు నమోదు కావడంతో మంత్రివర్గం అత్యవసరంగా సమావేశమైంది. పదిహేను రోజులపాటు ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ప్రకటించింది.