Wife Visiting Husband's Office And Abusing Him Is Cruelty: High Court
mictv telugu

పనిచేస్తున్న ఆఫీసుకెళ్లి మరీ భర్తను వేధించడం క్రూరత్వమే.. కోర్టు

August 30, 2022

భర్త పనిచేసే ఆఫీసుకు భార్య వెళ్లి పది మంది ముందు అతడిని బూతులతో తిట్టడం, మానసికంగా వేధించడం, చేయి చేసుకోవడం క్రూరత్వమే అవుతుందని ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు అభిప్రాయపడింది. ఓ విడాకుల కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళితే.. ధంతరి జిల్లాకు చెందిన 32 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగికి 2010లో రాయ్‌పుర్‌కు చెందిన ఓ మహిళతో వివాహమైంది. అయితే కొంతకాలానికి వీరిమధ్య మనస్పర్థలు తలెత్తడంతో భర్త.. విడాకుల కోసం రాయ్‌పుర్‌ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు.

తనకు వివాహేతర సంబంధం ఉందని, ఆ ఉద్దేశంతో ప్రతీసారి పనిచేసే చోటుకు వచ్చి ఇష్టం వచ్చినట్లు అందరిముందు నానా గొడవ చేసేదని, బూతులతో తిట్టేదని.. భార్య చేసిన తప్పుడు ఆరోపణల కారణంగా తన పరువుకు భంగం కలిగిందని ఆ వ్యక్తి రాయ్‌పుర్‌ ఫ్యామిలీ కోర్టు తెలిపాడు. అక్కడితో ఆగకుండా తనను మరోచోటుకు బదిలీ చేయించేందుకు ముఖ్యమంత్రికి లేఖ కూడా రాసిందని వాపోయాడు. ఈ కేసులో విచారణ చేపట్టిన రాయ్‌పుర్‌ ఫ్యామిలీ కోర్టు 2019 డిసెంబరులో రాయ్‌పుర్‌ ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది.

ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ అతడి భార్య హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ కూడా ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. రాయ్‌పుర్‌ ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకులను సమర్థించింది. ‘‘సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత భర్తకు వివాహేతర సంబంధం ఉందని భార్య చేసిన ఆరోపణలు అవాస్తవమని తేలింది. ఈ తప్పుడు ఆరోపణలతో ఆ భార్య.. భర్త పనిచేసే ఆఫీసుకు వెళ్లి అక్కడ తన సహోద్యోగుల ముందు అతడిని దూషిస్తూ మాట్లాడటం, అతడి పరువు తీసేలా ప్రవర్తించడం క్రూరత్వమే అవుతుంది. భర్త తన తల్లిదండ్రులను కలుసుకోకుండా వేధించడం, అక్రమ సంబంధం నిందలు వేసి అతడిని బదిలీ చేయాలని కోరడం కూడా తీవ్రమైన విషయమే. అందుకే ఆ భార్య నుంచి విడాకులు మంజూరు చేస్తూ రాయ్‌పుర్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థిస్తున్నాం’’ అని హైకోర్టు స్పష్టం చేసింది.