పెళ్లి పందిరిలో ఊడిన విగ్గు.. రద్దైన పెళ్లి - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లి పందిరిలో ఊడిన విగ్గు.. రద్దైన పెళ్లి

May 23, 2022

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉన్నావ్‌లో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాసేపట్లో పెళ్లి అయిపోతుందని ఆశగా ఎదురుచూసిన వరుడికి, వధువు బిగ్ షాక్ ఇచ్చింది. పెళ్లికొచ్చిన బంధువులు వధువుకు జరిగిన అవమానం తట్టుకోలేక వరుడి కుటుంబ సభ్యులతో గొడవకు దిగిన ఘటన సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ ప్రాంతంలో సంతోషంగా పెళ్లి వేడుక మొదలైంది. కొద్దిసేపట్లో తన పెళ్లి అయిపోతుందని పెళ్లి కొడుకు ఎంతో సంబ‌ర‌ప‌డిపోతున్నాడు. పెళ్లిలో భాగమైన జయమాల వేడుక తర్వాత పెళ్లికొడుకు అల‌సిపోయి స్పృహ తప్పిపడిపోయాడు. దాంతో అత‌డిని లేపేందుకు పెళ్లికూతురు సోదరుడు ముఖంపై నీళ్లు చల్లి, వరుడి తలపాగా తీయ‌బోతుండగా, ఒక్కసారిగా విగ్గు ఊడి కిందపడింది. దాంతో పెళ్లి కూతురు ఒక్కసారిగా షాక్ అయ్యింది. పెళ్లి కొడుకుకి బ‌ట్ట‌త‌ల ఉంద‌ని త‌మ‌కు ముందుగానే ఎందుకు చెప్ప‌లేద‌ని, ఇంత మోసం చేస్తారా? అంటూ వరుడి కుటుంబ సభ్యులను నిల‌దీశారు. అనంతరం బట్టతల ఉన్న వ్యక్తిని తాను పెళ్లి చేసుకోనని పెళ్లికూతురు పెళ్లిపీటల నుంచి వెళ్లిపోయింది. దాంతో ఇరు కుటుంబల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.

ఈ క్రమంలో పెళ్లికొచ్చిన బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు కుటుంబాలను స‌ముదాయించి, గొడ‌వ‌ను ఆపారు. చివ‌రి నిమిషంలో పెళ్లి ర‌ద్దు కావ‌డంతో వ‌రుడు తీవ్ర నిరాశ చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.