నా సినిమా కోసం ఏమైనా చేస్తా: విశ్వక్‌సేన్ - MicTv.in - Telugu News
mictv telugu

నా సినిమా కోసం ఏమైనా చేస్తా: విశ్వక్‌సేన్

May 2, 2022

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌ సేన్ తాజాగా చేసిన ఫ్రాంక్ వీడియోపై సోమవారం హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విశ్వక్ సేన్ కాసేపటి క్రితమే స్పందించారు. ”నేను నటించిన నాలుగో చిత్రమిది. నా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి ఏమైనా చేస్తా. సినిమాను బతికించుకోవలసిన బాధ్యత నాపై ఉంది. ప్రమోషన్‌ కోసం రెండు నిమిషాల ఫ్రాంక్‌ వీడియో చేశా. అందులో పెట్రోల్‌కు బదులు నీళ్లు వాడాం. ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి పిటీషన్‌లో పెట్రోల్‌ అని పేర్కొన్నారు.

దానిని సాకుగా తీసుకుని బతుకుతెరువు కోసం ఫ్రాంక్‌ వీడియోలు చేస్తే, అందరి మీద కేస్‌ వేస్తానని అనడం న్యాయం కాదు. వాళ్లు చాలా చిన్న మనుషులు. వారిని బతకనిద్దాం. నేను ఎన్నో కష్టాలు చూసి ఇక్కడి వరకూ వచ్చా. నాకు ఏదైనా సమస్య వచ్చినా నేను తట్టుకోగలను. కానీ, వారు తట్టుకోలేరు. నా వల్ల వాళ్లకు ఇబ్బంది కలిగితే నాకు గిల్టీగా ఉంటుంది” అని అన్నారు.

మరోపక్క విశ్వక్‌ సేన్ తాజాగా నటించిన చిత్రం ‘అశోకవనంలో అర్జున కల్యాణం’.ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా చిత్రబృందం హైదరాబాద్‌లోని ఓ కాలనీ రోడ్డుపై ఫ్రాంక్‌ వీడియో చేసింది. ఆ వీడియో సంచలనంగా మారడంతో హైకోర్టు న్యాయవాది ఫిర్యాదు చేయడంపై విశ్వక్‌ సేన్ స్పందించారు.