వానాకాలం పంటల సాగుకు సిద్ధమైన రైతులకు వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శుభవార్త అందించారు. త్వరలోనే రైతులందరి ఖాతాల్లో రైతుబంధు పెట్టుబడి సాయం జమ చేస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఆర్థిక, వ్యవసాయ శాఖలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని ఆయన చెప్పారు. ‘ఎప్పట్లాగే ఈ వానాకాలం సీజన్‌లోనూ సకాలంలో డబ్బులు జమ చేస్తాం. రైతులెవరూ ఆందోళనకు చెందవద్దు’ అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లోని రైతుబంధు సమితి కార్యాలయంలో వ్యవసాయ శాఖ కాల్ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. త్వరలోనే టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను రైతులకు వివరించేందుకు, రైతుల విజ్ఞప్తులు స్వీకరించడం కోసమే ఈ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. రైతు బంధు, రైతు బీమా, ఇతర పథకాలకు సంబంధించి ఏ ఇతర వివరాల కోసమైనా కాల్ సెంటర్ ఉపయోగపడుతుందని తెలిపారు. రైతుబంధు నిధులు ఇంకెప్పుడు విడుదల చేస్తారని ప్రతిపక్షాలు నిలదీస్తున్న తరుణంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రైతుబంధు ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.