జనం మధ్యే ఉరేసుకుంటా.. గంభీర్ - MicTv.in - Telugu News
mictv telugu

జనం మధ్యే ఉరేసుకుంటా.. గంభీర్

May 10, 2019

దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆప్ అభ్యర్థి ఆతిషి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతున్నట్టే వుంది. ఆతిషి ఆరోపిస్తున్న మాట నిజమైతే తాను జనం మధ్య ఉరివేసుకుంటానని గంభీర్ ప్రకటించారు. వారిద్దరు ఈస్ట్ ఢిల్లీ లోక్‌సభ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ గంభీర్, ఆప్ అభ్యర్థిగా ఆతిషి బరిలో నిలబడ్డారు.

ఆతిషి గురువారం నాడు ఢిల్లీలో ఓ ప్రెస్‌మీట్ పెట్టి.. గంభీర్‌పై ఆరోపణలు చేశారు. గంభీర్ రాజకీయాలు చాలా నీచానికి దిగజారాయని అన్నారు. మహిళ అయిన తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ, తన ఆత్మగౌరవానికి భంగం కలిగించే రాతలు రాసిన పాంప్లెట్లను.. వివేక్ విహార్, కృష్ణ నగర్‌లలో బీజేపీ నేతలు పంచిపెడుతున్నారని ఆమె ఆరోపించారు. ఈ పాంప్లెట్లలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేరు కూడా ప్రస్తావించారన్నారు. ఇది తనకు తీరని అవమానం అని ప్రెస్‌మీట్‌లోనే కన్నీరు పెట్టుకున్నారు. గంభీర్‌పై ఢిల్లీ మహిళా కమిషన్‌కు, ఈసీకి ఫిర్యాదు చేశారు.

hang myself in public if proves allegations Gautam Gambhir on pamphlet row.

ఈ విషయమై గంభీర్ స్పందించారు. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మహిళలను గౌరవించే కుటుంబం నుంచి తాను వచ్చానని అన్నారు. ఆమెను ఉద్దేశించి తాను అలాంటి మాటలు అన్నట్టుగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిరూపిస్తే.. జనం మధ్య ఉరి వేసుకుంటానని అన్నారు. నిరూపించలేకపోతే కేజ్రీవాల్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని సవాల్ విసిరారు. చీపురుకట్టతో కేజ్రీవాల్ మైండ్‌ను ఎవరైనా కడిగేయాల్సిన టైమ్ వచ్చింది.. లేదంటే ఆయన ఇంకా దిగజారుతారని మండిపడ్డారు గంభీర్. కాగా, గంభీర్‌కు సహచర క్రికెటర్లు లక్ష్మణ్, హార్బజన్ సింగ్‌ల నుంచి సపోర్ట్ లభిస్తోంది. గంభీర్ ఆడవాళ్లను కించపరిచే వ్యక్తిత్వం కలవాడు కాదని ట్వీట్లు చేశారు.