మమతా బెనర్జీని కౌలిగించుకుని, రోగం అంటిస్తా.. బీజేపీ నేత వివాదం  - MicTv.in - Telugu News
mictv telugu

మమతా బెనర్జీని కౌలిగించుకుని, రోగం అంటిస్తా.. బీజేపీ నేత వివాదం 

September 28, 2020

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కౌగిలించుకుని కరోనా రోగం అంటించేస్తానని ఓ బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పుడే ఆమెకు ప్రజలు పడుతున్న కష్టాలు ఏంటో తెలియవు అని అంటున్నారు పశ్చిమ బెంగాల్ బీజేపీ జాతీయ కార్యదర్శి అనుపమ్ హజ్రా. ఇటీవలే బీజేపీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించగా హజ్రా కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. పదవిలోకి రావడం రావడమే ముఖ్యమంత్రిని టార్గెట్ చేశారు. ఉత్సాహమో, లేకపోతే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మీడియా అటెన్షన్ కోరుకుంటున్నారో తెలియదు కానీ తన వ్యాఖ్యలతో వివాదం రేపారు. 

కరోనా వ్యాప్తి మొదలయ్యాక పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వం తప్పుడు గణాంకాలు చూపిస్తోందని హజ్రా ఆరోపించారు. ‘నాకు కూడా ఏదో ఒక సమయంలో కరోనా సోకుతుంది. అప్పుడు నేరుగా వెళ్లి మమతా బెనర్జీని కౌగిలించుకుని కరోనాను అంటిస్తాను. అప్పుడు ఆమెకు కరోనా వస్తేగానీ, ప్రజలు పడుతున్న కష్టమేంటో అర్థం కాదు. తమవారిని కోల్పోయిన ప్రజల ఆవేదన అప్పటికి గాని ఆమెకు బోధపడదు’ అని హజ్రా తెలిపారు.
కాగా, అనుపమ్ హజ్రా వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. తృణమూల్ కాంగ్రెస్ రెఫ్యూజీ విభాగం సిలిగిరి పోలీస్ స్టేషన్‌లో హజ్రాపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.