నా తండ్రికి భారతరత్న ఇవ్వమని అడుక్కోలేను..ధ్యాన్‌చంద్ తనయుడు - MicTv.in - Telugu News
mictv telugu

నా తండ్రికి భారతరత్న ఇవ్వమని అడుక్కోలేను..ధ్యాన్‌చంద్ తనయుడు

August 30, 2019

Dhyan Chand's.

ఒలింపిక్స్‌లో మూడుసార్లు భారత్‌ను గెలిపించిన హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ తనయుడు, హాకీ ఇండియా మాజీ కెప్టెన్ అశోక్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్నకు ప్రముఖులను ఎంపిక చేసేటప్పుడు తన తండ్రిని విస్మరిస్తున్నారు అన్నారు. అయినా తన తండ్రికి భారతరత్న ఇవ్వాలని తాను అడుక్కోబోని వ్యాఖ్యానించారు. తన తండ్రికి భారతరత్న ఇచ్చే ఫైల్‌పై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అప్పట్లో సంతకం చేశారని, ఇదే విషయాన్ని అప్పటి కేంద్రమంత్రి కూడా తమకు తెలియజేశారన్నారు.

అయితే, ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారని ధ్యాన్‌చంద్‌కు భారతరత్న ఇవ్వలేదని పేర్కొన్నారు. తద్వారా ప్రభుత్వం తమను మాత్రమే కాదని, దేశానికి కీర్తిప్రతిష్ఠలు తెచ్చిన వ్యక్తిని అవమానించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధ్యాన్‌చంద్‌ లాంటి వ్యక్తిని దేశం ఎప్పటికీ మర్చిపోదని అన్నారు. 1936లో బెర్లిన్‌లో జరిగిన ఒలింపిక్ గేమ్స్‌కు తన తండ్రి సూట్‌కేసులో త్రివర్ణ పతాకాన్ని తీసుకెళ్లారని గుర్తు చేశారు. ఫైనల్‌లో జర్మనీని ఓడించిన తర్వాత హిట్లర్ ఎదుటే తన తండ్రి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారని అశోక్ కుమార్ గుర్తు చేశారు. గురువారం ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ధ్యాన్‌చంద్ జన్మదినాన్ని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసందే.